సతీ మమత  

Great Wife - Sakshi

 ప్రమాదంతో భర్తకు పనిచేయని కాలు, చేయి

వైద్యం కోసం తాళి, నగలు అమ్మిన భార్య మమత

మరో మూడేళ్లు వైద్యం చేయిస్తే బాగవుతాడంటున్న వైద్యులు

దాతల సాయం కోసం ఎదురుచూపులు

హుస్నాబాద్‌రూరల్‌ : కుటుంబాన్ని పోషించే భర్త ప్రమాదానికి గురై మంచాన పడ్డ భర్తకు తన నగలు చివరకు తాళి బొట్టుకూడా అమ్మి వైద్యం చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఈ సతీ మమత. కలకాలం ఏ కష్టం వచ్చిన తోడుగా ఉంటానని బాస చేసి తాళి కట్టిన భర్తకు అనుక్షణం అండగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. భర్త ఆస్పత్రి ఖర్చులకు, కుటుంబ పోషణకు ఆమె ఒంటి మీద ఉన్న బంగా రం, ఉన్న ఆస్తి అయిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక మమత సతమతమవుతోంది.

కులి పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నా, భర్తకు ఎలా వైద్యం చేయించాలో తెలియక సాయం కోసం ఎదురు చూస్తోంది. ప్రభుత్వం సీఎం సహాయ నిధి కింద సాయం మంజూరు చేయాలని వేడుకుంటోంది.

కుటుంబాన్ని కల్లోలం చేసిన ప్రమాదం..

హుస్నాబాద్‌ మండలంలోని మీర్జాపూర్‌కు చెందిన కుంటమల్ల రమణచారి మమత దంపతులు వివాహాం తర్వాత ఫోటో స్టూడియో నిర్వహిస్తూ జీవనం సాగించారు. వీరికి ఒక కూతురు ఉంది. రమణా చారి గత సంవత్సరం మార్చిలో ఓ పెళ్లికి ఫొటోలు తీయడానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించారు.

రమాణా చారి ప్రాణాలతో బయటపడ్డా ఎడమ చేయి, కాలు మాత్రం పనిచేయడం లేదు. నాటి నుంచి నేటి వరకు అతని వైద్యం కోసం రూ. 8 లక్షల వరకు ఖర్చైంది. అతని భార్య మమత తాన తాళితో సహా, నగలను సైతం అమ్మేసి వైద్యం చేయించింది. బంధువుల వద్ద రూ. 2 లక్షల అప్పు చేసి భర్త వైద్యం కోసం ఖర్చు పెట్టింది. కుటుంబ పోషనకు కూలి పనికి సైతం వెళ్తోంది. 

మరో నాలుగేళ్లు వైద్యం

మరో నాలుగు సంవత్సరాలు వైద్యం అందిస్తే రమణాచారి ఎప్పటిలాగే నడుస్తాడని వైద్యులు మమతకు సూచించారు. భర్తను ఎలాగైనా నడిచేలా చేయాలన్న సంకల్పంతో మమత ప్రతీ నెల హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్లో భర్తకు వైద్యం చేయిస్తోంది. ప్రతీ నెల వైద్య ఖర్చులకు రూ. 10 వేలు, ప్రయాణానికి మరో రూ. 2 వేలు ఖర్చు అవుతోంది. ప్రతీ నెల ఆ డబ్బులు సమకూర్చలేక మమత అవస్థలు పడుతోంది. అచేతన స్థితిలో ఉన్న తన భర్తకు ప్రభుత్వం స్పందించి చిన్న పని చూపించాలని వేడుకుంటోంది. తద్వారా మందుల ఖర్చులు అయినా తీరుతాయ ని ప్రాధేయపడుతోంది.

సాయం చేయని సదరం క్యాంపు అధికారులు..

ఏడాది నుంచి రమణచారి సదరం క్యాంపు చుట్టూ తిరుగుతున్నా అధికారులు కనికరించడం లేదు. 2017 సెప్టెంబర్‌లో సిద్దిపేట సదరం క్యాంపుకు పోయిన రమణచారికిని వైద్యులు పరీక్షించి ఎలాంటి ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా ఇంటికి పంపించారు. ంతో అధికారులు పింఛన్‌ ఇవ్వడం లేదు.  

అందని సీఎం సహాయ నిధి...

 భర్త ఆరోగ్యం కోసం మరో మూడేళ్లు వైద్యం అందించడానికి వైద్యం కోసం చేతిలో పైసలు లేక అవస్థలు పడుతోంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తన భర్తకు వైద్యం చేయించడానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు స్పందించి సీఎం సహాయ నిధి నుంచి సహాయం అందేలా చూడాలని కోరుతోంది. జిల్లా కలెక్టర్‌ స్పందించి కంప్యూటర్‌ పరిజ్ఞనం ఉన్న రమణాచారికి ఏదైన ఉపాధి చూపించి వీధిన పడ్డ తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మమత వేడుకుంటోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top