వడిచర్లకు అరుదైన గౌరవం

Great Honor To Poet - Sakshi

‘మణిపూసలు’కు అంతర్జాతీయ గుర్తింపు

కవితా ప్రక్రియకు మూడు బుక్కుల్లో చోటు

రేపు తెలుగు సాహిత్య పీఠం ఆధ్వర్యంలో రచయిత సత్యానికి సన్మానం

బొంరాస్‌పేట, బషీరాబాద్‌: ‘శ్రీపద’ కలం పేరుతో రచనలు చేస్తున్న ప్రముఖ వర్ధమాన తెలుగు కవి, కవిరత్న బిరుదు గ్రహీత వడిచర్ల సత్యం రూపొందించిన ‘మణిపూసలు’ కవితా ప్రక్రియ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఈయన రాసిన కవితా ప్రక్రియ ‘మణిపూసలు’ తెలుగు రాష్ట్రాల సాహిత్యంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో అంతర్జాతీయ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుతో పాటు, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డు, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ తెలుగు సాహిత్య కళాపీఠం మంగళవారం కవి సత్యంను సన్మానించనుంది. సత్యం తనదైన ముద్రతో తెలుగుభాషకు వర్ధమాన సాహితీప్రియులను పరిచయం చేస్తున్నారు.

గురజాడ అప్పారావు అందించిన ‘ముత్యాలసరాలు’ వంటి నూతన మాత్ర చంధస్సు నియమాలతో ‘మణిపూసలు’ అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తాను సృష్టించిన మాత్ర నియమాలు, అంత్యప్రాయలతో కూడిన మణిపూసలపై సామాన్యులు సైతం ఆదరాభిమానాలు చూపుతున్నారు. దీంతో గత మూడు నెలల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 125 మంది మణిపూసలు ఆధారంగా సులభ వ్యాకరణంతో కవితలు, పద్యాలు రాయడంతో ఇది బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిం ది.

చిక్కడపల్లిలోని లలితకళా వేదిక, త్యాగరాయగాన సభలో జరిగే సత్యం సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ శ్రీధర్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహ్మరెడ్డి, పలువురు తెలుగు సాహిత్య రచయితలు హాజరవనున్నట్లు తెలుగు సాహిత్య పీఠం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా వడిచర్ల సత్యంకు దక్కిన అరుదైన గౌరవానికి తాండూరు కాగ్నా కళా సమితి ప్రతినిధులు శివకుమార్, కార్యదర్శి మెట్లుకుంట రాములు, పలువురు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top