సాయంత్రం వేళ.. సరదా సరదాగా!

 Governor's Couple boating at kotpally project - Sakshi

కోట్‌పల్లి ప్రాజెక్టులో గవర్నర్‌ దంపతుల బోటింగ్‌

హైదరాబాద్‌: మండు వేసవిలో నిండుకుండలా ప్రాజెక్టు... పరిసరాల్లో పచ్చదనం.. ఆహ్లాదపర్చే వాతావరణం... పరవశింపజేసే ప్రకృతి.. సాయంత్రం వేళ సరదాగా బోటింగ్‌... వెరసి గవర్నర్‌ దంపతులు ముగ్ధు లయ్యారు. వికారాబాద్‌ జిల్లాలోని కోట్‌పల్లి ప్రాజెక్టులో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు గురువారం సాయంత్రం సరదాగా బోటింగ్‌ చేశారు. రెండు వేర్వేరు బోట్లలో ప్రాజెక్టును చుట్టివచ్చారు. బోట్‌ ఎక్కబోతూ పట్టుతప్పిన గవర్నర్‌ను సేఫ్టీగార్డ్స్‌ పట్టుకుని బోట్‌లో కూర్చోబెట్టారు. దాదాపు 15 నిమిషాలపాటు బోటింగ్‌ చేశారు.

ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రోత్సాహంతో జేకేఎంఆర్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన బోటింగ్‌పై గవర్నర్‌ దంపతులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు కోట్‌పల్లి అందాలను చూపించిన సేఫ్టీగార్డ్స్‌కు రూ.4 వేల చెక్కు అందజేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయా లని కలెక్టర్‌కు సూచించారు. ప్రాజెక్టు వద్ద 500 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఎంపీ ప్రయత్నిస్తున్నారని జేకేఎంఆర్‌ ఫౌండే షన్‌ కో ఆర్డినేటర్‌ రాములు గవర్నర్‌కు వివరించారు.

పురుషులు, మహిళాసేఫ్టీగార్డ్స్‌ను వేర్వేరుగా గవర్నర్‌ పిలిచి వారి ఉపాధి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలను బాగా చదివించాలని, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలను ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం సేఫ్టీగార్డ్స్‌తో కలసి గ్రూప్‌ఫొటో దిగారు. తిరిగి వెళ్తూ మండలం లోని గడ్డమీది గంగారం రైతులతో ముచ్చటిం చి పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు.  

అనంత పద్మనాభస్వామి దర్శనం
నరసింహన్‌ దంపతులు అనంతగిరి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శుక్రవారం ఏకాదశి కావడంతో ఉదయం స్వామివారి సాలగ్రామ రూప దర్శనం చేసుకునే అవకాశముందని తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top