గనులేమీ అక్షయ పాత్రలు కావు!

Governor Narasimhan at the International Mining Conference - Sakshi

     దుర్వినియోగం చేస్తే వైపరీత్యాలు, ఆపదలు తప్పవు 

     అంతర్జాతీయ మైనింగ్‌ సదస్సులో గవర్నర్‌ నరసింహన్‌ 

     తెలంగాణకు అర్ధరాత్రి కూడా సాయానికి సిద్ధం: కేంద్ర మంత్రి తోమర్‌ 

     దేశంలో ఎక్కడా లేని విధంగా సాండ్‌ ట్యాక్సీలు: మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: గనులేమీ అక్షయ పాత్రలు కావని.. దుర్వినియోగం చేస్తే వైపరీత్యాలు, ఆపదలు తప్పవని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. గనుల తవ్వకాల కోసం ధ్వంసం చేసిన అడవులను తప్పనిసరిగా పునరుద్ధరించాలని, లేదంటే కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకురావాలన్నారు. మైనింగ్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఫిక్కీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన 4 రోజుల అంతర్జాతీయ మైనింగ్‌ సదస్సు, ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నరసింహన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గనులు, ఖనిజాలు సంపద సృష్టించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని.. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యాన్ని కొనలేమన్న విష యం గుర్తెరగాలని మైనింగ్‌ వ్యాపారస్తులకు సూచించారు.

గని కార్మికులు యంత్రాలు కాదని.. వారి రక్షణ, ఆరోగ్యం ప్రధాన అంశంగా ఉండాలన్నారు. గనుల ప్రభావిత ప్రాంత ప్రజల సంక్షేమం కోసం కేంద్రం తీసుకొచ్చిన డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌(డీఎంఎఫ్‌) ప్రాజెక్టు ను పారదర్శకంగా అమలు చేస్తే లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు. గనుల కారణంగా నిర్వాసితులైన ప్రజలకు తప్పనిసరిగా పునరావాసం కల్పించాలని చెప్పారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 సున్నపు రాయి బ్లాక్‌లు వేలానికి రానున్నాయని, వేలంలో సమస్యలొస్తే అర్ధరాత్రి ఒంటి కాలిమీద నిలబడి సహాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. డీఎంఎఫ్‌ కింద ఇప్పటికే మైనింగ్‌ జరిగే జిల్లాలకు రూ.1,300 కోట్లు విడుదలయ్యాయని, తెలంగాణకూ రూ.1,300 కోట్లు వచ్చాయని తెలిపారు.

ఖమ్మంలో స్టీల్‌ ప్లాంట్‌ ఖాయం: కేటీఆర్‌ 
రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఖమ్మం జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు ఖాయమని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు లేవని మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. ప్రాజెక్టుతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించనుందని చెప్పారు. సూర్యాపేట జిల్లాలో సున్నపు రాయి గనుల అన్వేషణ 3 నెలల్లో పూర్తవుతుందని, త్వరలో వేలానికి వెళ్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫోన్‌ చేస్తే ఇంటికి ఇసుక సరఫరా చేసేలా సాండ్‌ ట్యాక్సీల విధానాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. 2016–17లో గనుల ద్వారా రాష్ట్రానికి రూ.3,170 కోట్ల ఆదాయం వచ్చిందని.. ఈ ఏడాది రూ.3,500 కోట్లకు పెరగనుందని చెప్పారు. గనుల తవ్వకాల నియంత్రణకు జియో ట్యాగింగ్, జియో మ్యాపింగ్, డ్రోన్లను సైతం వినియోగంలోకి తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి మైనింగ్‌ రంగం చోదకశక్తిగా పరిగణిస్తామని, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకునే మైనింగ్‌ నిర్వహించాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top