
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగబోతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లడంతో రాష్ట్రంలో ప్రారంభమైన ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పరంపరకు తాజాగా ముగిసిన జెడ్పీ ఎన్నికలతో తెరపడింది. వరుసగా రాష్ట్రంలో శాసనసభ, పంచాయతీ, లోక్ సభ, శాసనమండలి, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగడంతో 9 నెలలుగా పాలనా వ్యవహారాల్లో స్తబ్దత నెలకొంది. ఎట్టకేలకు ఎన్నికల ప్రవర్తన నియ మావళి అమలు శనివారంతో ముగిసింది. దీంతో ఇప్పుడిప్పుడే పరిపాలనా వ్యవహారాల్లో కదలిక ప్రారంభమైంది.
గత డిసెంబర్‌లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించి రెండో పర్యాయం పాలనా పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ‘కొత్త జట్టు’రూపకల్పనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టిసారించారు. జిల్లా స్థాయిలో పనిచేసే కలెక్టర్లు, ఎస్పీల నుంచి రాష్ట్ర స్థాయిలో పనిచేసే సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు భారీ ఎత్తున స్థానచలనం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ అవసరాలు, ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టు కుని కొత్త జట్టు కూర్పును తయారు చేస్తున్నారు. తమ మాట వినే అధికారులను తమ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలుగా నియమించాలని పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు.
బదిలీల కసరత్తు పూర్తైనట్లు తెలిసింది. 18 జిల్లాల కలెక్టర్లతోపాటు వివిధ శాఖల ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల హోదా లో పనిచేస్తున్న సుమారు 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేయనున్నట్లు సమాచారం. కొన్ని శాఖల్లో సీనియర్ ఐఏఎస్‌లు దీర్ఘ కాలంగా పనిచేస్తున్నారు. వీరందరిని కొత్త స్థానాలకు బదిలీ చేయనున్నారు. పలు జిల్లాల ఎస్పీలతో పాటు డీఐజీ, ఐజీ హోదా గల మరో 20 మంది వరకు ఐపీఎస్‌లకు స్థానచలనం కలిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై సీఎం కేసీఆర్ గత ఆదివారమే కసరత్తు చేశారు. శాసనసభ ఎన్నికలకు ముందు సిరిసిల్ల కలెక్టర్‌గా కృష్ణభాస్కర్, సిద్దిపేట కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి ఉండేవారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా అప్పట్లో వీరిని బదిలీ చేశారు. తాజాగా వీరిద్దరినీ పూర్వ స్థానాలకు బదిలీ చేస్తూ గత ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మిగిలిన ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల విషయంలో ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయి.