పనీ మాదే.. పైసా మాదే!

Government Officers Become Benami Contractors In Transco Department - Sakshi

కరెంటు సంస్థల్లో ఖతర్నాక్‌లు.. బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తిన అధికారులు

కుటుంబ సభ్యులు, సమీప బంధువుల పేర్లతో కాంట్రాక్టర్‌ లైసెన్సులు

నామినేషన్‌పై పనుల కేటాయింపు.. అంచనాలు పెంచి అందినకాడికి జేబుల్లోకి..

అడ్డదారిలో లక్షల రూపాయల విలువైన పనులు

డైరెక్టర్, ఎస్‌ఈ, డీఈ, ఏడీఈ, ఏఈ స్థాయి అధికారుల నిర్వాకం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో కొందరు అధికారులు బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తారు! కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితుల పేర్లతో కాంట్రాక్టర్‌ లైసెన్సులు పొంది లక్షలు కొల్లగొడుతున్నారు. నామినేషన్‌ పద్ధతిలో పనులను చేజిక్కించుకొని సర్కారు సొమ్మును జేబులో వేసుకుంటున్నారు. కొందరు అధికారులైతే తమ బినామీల కోసమే అడ్డగోలుగా పనులకు అంచనాలు రూపొందించి తూతూమంత్రంగా పనులు చేసి బిల్లులు స్వాహా చేస్తున్నారు. పనుల అంచనాల తయారీ, ఓపెన్‌ టెండర్ల నిర్వహణ, నామినేషన్ల కింద పనుల కేటాయింపు, పనుల నిర్వహణ, పర్యవేక్షణ, బిల్లుల జారీ అధికారం.. ఇలా అంతా తమ చేతుల్లోనే ఉండటంతో ఈ అధికారుల అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.

తల్లి, భార్య, బావమరిది, సోదరుడు, కుమారుడు, కోడలు, కుమార్తె, అల్లుడు, మనవడు, అమ్మమ్మ, నాయనమ్మ, తాత, మేనకోడలు, ఇతర సమీప బంధువుల పేర్లతో కాంట్రాక్టర్‌ లైసెన్స్‌లు పొంది అడ్డదారిలో రూ.లక్షల విలువైన పనులను దక్కించుకుంటున్నారు. బినామీ కాంట్రాక్టర్లను అడ్డం పెట్టుకుని కొందరు పనుల అంచనాలను అడ్డగోలుగా పెంచేస్తున్నారని, మరికొందరు పనులు చేయకుండానే బిల్లులు కాజేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా అధికారులే బినామీ కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నా సంస్థ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. 

ఉన్నతాధికారులు సైతం.. 
తెలంగాణ ట్రాన్స్‌కో, దక్షిణ/ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌/ఎన్పీడీసీఎల్‌)లో పని చేస్తున్న ఓ డైరెక్టర్‌ స్థాయి అధికారితోపాటు పలువురు సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు(ఎస్‌ఈ), అదనపు డివిజినల్‌ ఇంజనీర్లు(ఏడీఈ), డివిజినల్‌ ఇంజనీర్లు(డీఈ), అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఏఈ)లు, ఇతర స్థాయిల ఉద్యోగులు సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లతో బినామీ కాంట్రాక్టర్లుగా చక్రం తిప్పుతున్నారు. కొందరు అధికారులు స్వయంగా కాంట్రాక్టు పనులు చేస్తుండగా, మరికొందరు అమ్యామ్యాలు తీసుకుని బంధువులకు పనులు అప్పగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

తమ కుటుంబ సభ్యులు, బంధువులెవరూ విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగులుగా లేరని ప్రతి పనికి సంబంధించిన టెండరు దాఖలు సందర్భంగా కాంట్రాక్టర్లు రాత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ కాంట్రాక్టర్ల కుటుంబ సభ్యులెవరైనా విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగులుగా తేలితే కాంట్రాక్టును రద్దు చేయడంతో పాటు సంస్థకు జరిగిన నష్టాన్ని తిరిగి వసూలు చేయాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఎస్‌ఈ, డీఈ స్థాయి అధికారులకు రూ.5 లక్షలలోపు పనులకు పరిపాలన అనుమతులు జారీ చేసే అధికారం ఉంది. దీంతో వారే కాంట్రాక్టులు దక్కించుకుంటూ, పనులు మంజూరు చేసుకుంటున్నారు. అలాగే కింది స్థాయి అధికారుల బినామీలకు సైతం పనులు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

బహిరంగ ప్రకటన లేకుండానే నామినేషన్లు 
రూ.5 లక్షల లోపు అంచనా వ్యయం కలిగిన పనులకు ఆన్‌లైన్‌ టెండర్ల నిర్వహణ నుంచి ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. రూ.5 లక్షలలోపు అంచనా వ్యయం కలిగిన పనులను ఓపెన్‌ టెండర్ల విధానంలో నామినేషన్‌ ప్రాతిపదికన కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు అనుమతిచ్చింది. అత్యవసరంగా నిర్వహించాల్సిన పనులకు ఆన్‌లైన్‌ ద్వారా టెండర్లు నిర్వహిస్తే తీవ్ర జాప్యం జరుగుతుందనే ఆలోచనతో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకునే కొందరు విద్యుత్‌ అధికారులు బినామీ కాంట్రాక్టర్ల దందాకు తెరలేపారు. నామినేషన్ల విధానంలో చేపట్టే పనులకు తొలుత ఓపెన్‌ టెండరు ప్రకటనను విడుదల చేయాలి. ఆ తర్వాత కనీసం ముగ్గురు కాంట్రాక్టర్ల నుంచి కొటేషన్లను స్వీకరించాలి.

అందులో తక్కువ రేటు సూచించిన వ్యక్తికి అర్హతల ప్రకారం పనులు అప్పగించాలి. అయితే నామినేషన్ల కింద చేపట్టే పనులకు చాలాచోట్ల బహిరంగ టెండరు ప్రకటన జారీ చేయడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా పనులను బినామీలకు కేటాయించుకుంటున్నారు. తెలిసిన ముగ్గురు కాంట్రాక్టర్ల నుంచి కొటేషన్లు తెప్పించుకుని, వాటిలో తమ బినామీ కాంట్రాక్టర్‌కు వర్క్‌ ఆర్డర్‌ దక్కేలా కొందరు అధికారులు చక్రం తిప్పుతున్నారు. మిగిలిన ఇద్దరు కాంట్రాక్టర్లతో పోలిస్తే బినామీ కాంట్రాక్టర్‌కు సంబంధించిన కొటేషన్‌లో రేటును క్తాస తగ్గించి పనులను చేజిక్కించుకుంటున్నారు. చాలా కార్యాలయాల నోటీసు బోర్డుల్లో నామినేషన్ల కింద పనుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన 15 రోజుల తర్వాత ఓపెన్‌ టెండరు ప్రకటనలు దర్శనమిస్తున్నాయి.

దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ గ్రామ్‌ జ్యోతి యోజన(డీడీయూజీజేవై), ఇంటిగ్రేటెడ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ స్కీం(ఐపీడీఎస్‌) పథకాల కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా, పంపిణీకి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల నిధులు కేటాయించాయి. వీటితోపాటు ఇతర పథకాల కింద రూ.5 లక్షల లోపు అంచనా వ్యయంతో నామినేషన్‌పై కేటాయిస్తున్న పనుల్లో ఎక్కువ శాతం అధికారుల బినామీ కాంట్రాక్టర్లే చేజిక్కించుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో తమకు పనులు దక్కడం లేదని ఇతర కాంట్రాక్టర్లు వాపోతున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top