
చిన్నారులకు ‘టీకా’ రక్ష
దేశవ్యాప్తంగా చిన్నారులకు టీకాలు సరిగా అందడం లేదన్న ‘డీఎల్‌హెచ్‌ఎస్’ సర్వే నివేదికపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
* ‘మిషన్ ఇంద్రధనుష్’ను ప్రారంభించనున్న కేంద్రం
* మార్చి నుంచి దేశంలోని శిశువులందరికీ టీకాలు
* ఏపీలో 5, తెలంగాణలో 2 జిల్లాలు సహా తొలిదశలో 201 జిల్లాల్లో అమలు
* ‘మిషన్ ఇంద్రధనుష్’ దేశవ్యాప్తంగా 201 జిల్లాల్లో.. ఏపీలో తూ.గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ
* తెలంగాణలో ఆదిలాబాద్, మహబూబ్‌నగర్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చిన్నారులకు టీకాలు సరిగా అందడం లేదన్న ‘డీఎల్‌హెచ్‌ఎస్’ సర్వే నివేదికపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ వివిధ వ్యాధులకు సంబంధించిన టీకాలు వేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘మిషన్ ఇంద్రధనుష్’ పేరిట ఒక ప్రత్యేక పథకాన్ని చేపట్టి... మార్చి నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు అందాయి. ఇటీవల కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ, కేంద్ర గణనశాఖల ఆధ్వర్యంలో డీఎల్‌హెచ్‌ఎస్ (డిస్ట్రిక్ట్ లెవెల్ హౌస్‌హోల్డ్ సర్వే) నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారులకు వ్యాక్సిన్లకు సంబంధించి కొన్ని చేదు నిజాలు బయటపడ్డాయి. కొందరు చిన్నారులు కొన్ని వ్యాక్సిన్లకే పరిమితంకాగా... కొందరు అసలు ఏ వ్యాక్సిన్ కూడా వేసుకోలేదని బయటపడింది. దేశవ్యాప్తంగా 89 లక్షల మంది చిన్నారులకు టీకాలు వేయలేదని వెల్లడైంది. అంతేగాకుండా గర్భిణులు, చిన్నారుల్లో తీవ్ర రక్తహీనత నెలకొందని తేలింది. ఈ సర్వే నివేదికల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ ఇంద్రధనుష్’ను ప్రవేశపెట్టినట్టు అధికారులు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో చిన్నారులకు వందశాతం టీకాలు వేసేందుకు ఈ భారీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘మిషన్ ఇంద్రధనుష్’ పథకాన్ని తొలిదశలో దేశవ్యాప్తంగా 201 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేయనున్నారు.
ఈ జిల్లాల్లో 50% మాత్రమే టీకాల కార్యక్రమం జరిగిందని, అందువల్లే వాటిని తొలిదశలో ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెల నుంచి ప్రతి నెలలో 7 రోజుల పాటు పూర్తిగా చిన్నారులకు వ్యాక్సిన్లు వేయడంపైనే అధికారులు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది. 8 ప్రాణాంతకమైన జబ్బులకు ఈ పథకం కింద టీకాలు వేయనున్నారు. 5 రకాల జబ్బులకు పనిచేసే పెంటావాలెంట్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిని త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అందుబాటులోకి తేనున్నారు.
టీకాలు వేసే జబ్బులు
డిఫ్తీరియా (కంఠసర్పి), పర్చూసిస్
(కోరింత దగ్గు), టెటనస్ (ధనుర్వాతం), పోలియో, ట్యూబర్క్యులోసిస్ (టీబీ),
మీజిల్స్ (తట్టు), హెపటైటిస్-బి,
జపనీస్ ఎన్‌సెఫలైటిస్ (మెదడువాపు)
అందరికీ అందించడమే..
మురికివాడలు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలతో పాటు వ్యాక్సిన్‌లు సరిగా అందని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో శిశువులందరికీ వ్యాక్సిన్‌లు వేయాలనేది లక్ష్యం.