ఉద్యోగుల విభజనలో కమల్‌నాథన్ కమిటీ జాప్యం చేయడంతోనే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలకు ఆలస్యం అవుతోందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్ అన్నారు.
ఆదిలాబాద్ : ఉద్యోగుల విభజనలో కమల్‌నాథన్ కమిటీ జాప్యం చేయడంతోనే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలకు ఆలస్యం అవుతోందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న డిపార్ట్‌మెంటల్ పరీక్షలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కమల్‌నాథన్ కమిటీ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను తెలుపకపోవడం, ఉద్యోగుల విభజన చేయకపోవడంతో నియామకాలు ఆలస్యమవుతున్నాయన్నారు.
జూన్ 2వ తేదీ తర్వాత రెండు వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. గ్రూప్-1, గ్రూప్-4 లతో పాటు ఇతర ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రంలో మొత్తం లక్షా 7 వేల వరకు ఖాళీలు ఉన్నాయన్నారు. రాబోయే రెండేళ్లలో దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందుతారన్నారు. దీంతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరుపుతామని తెలిపారు. గత ఏపీపీఎస్సీలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, తాము మాత్రం పారదర్శకంగా నియామకాలు చేపడుతామని వివరించారు.