రిటైర్డ్‌ ఉద్యోగులకు శుభవార్త | good news for retired employees | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ ఉద్యోగులకు శుభవార్త

May 10 2017 1:53 AM | Updated on Sep 5 2017 10:46 AM

రిటైర్డ్‌ ఉద్యోగులకు శుభవార్త

రిటైర్డ్‌ ఉద్యోగులకు శుభవార్త

రిటైరైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రాట్యుటీ వ్యత్యాసబకాయిల విడుదల
 
 రూ. 4 లక్షల వ్యత్యాసం చెల్లించేలా ఉత్తర్వులు జారీ
 2014 జూన్‌ 2 నుంచి 2015 ఫిబ్రవరి 28 మధ్య రిటైరైన వారికి వర్తింపు  
 
సాక్షి, హైదరాబాద్‌: 
రిటైరైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పదో పీఆర్‌సీ సిఫారసుల ప్రకారం రిటైరైన ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీని ప్రభుత్వం రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచింది. సవరించిన గ్రాట్యుటీ 2014 జూన్‌ 2 నుంచే అమల్లోకి తెచ్చింది. 2015 మార్చి 1 నుంచి సవరించిన గ్రాట్యుటీని ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించింది. అయితే ఈ తొమ్మిది నెలల వ్యవధిలో రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ. 4 లక్షల చొప్పున గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలను రెండేళ్లుగా పెండింగ్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో వ్యత్యాస బకాయిల చెల్లింపులకు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు జీవో నం.79 జారీ చేశారు. 2014 జూన్‌ నుంచి 2015 ఫిబ్రవరి 28 మధ్య రిటైరైన ఉద్యోగులకు ఈ బకాయిలు చెల్లించనున్నట్లు సర్కారు ఉత్తర్వుల్లో పొందుపరిచింది. తెలంగాణ స్టేట్‌ ఆడిట్‌ అకౌంటెంట్‌ జనరల్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
 
రాష్ట్రంలోని అన్ని ట్రెజరీల అధికారులు, పెన్షన్‌ పేమెంట్‌ అధికారులు ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ తొమ్మిది నెలల వ్యవధిలో రిటైరై, వ్యత్యాస బకాయిలు అందుకోకుండానే మరణించిన పెన్షనర్లు ఎవరైనా ఉంటే నిబంధనల ప్రకారం వారి వారసులకు ఈ బకాయిలను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు యూనివర్సిటీ, ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీల టీచర్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. దాదాపు రూ.190 కోట్ల గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలను చెల్లించాల్సి ఉన్నట్లుగా ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement