విషమని తెలిసీ విక్రయాలు

Glyphosate Using To Crops Causes Cancer In Humans - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్లైఫోసేట్‌.. జీవవైవిధ్యానికి తీవ్ర హాని కలిగించే రసాయనం. మానవ జీవితాలను కేన్సర్‌ మహమ్మారిపాలు చేసే కాలకూట విషం. ఇలాంటి విషాన్ని రాష్ట్రంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. బీజీ–3 పత్తి విత్తనాలు వేసిన పొలంలో కలుపు నియంత్రణ కోసం ఈ మందును అడ్డగోలుగా వాడుతున్నారు. కొందరైతే సాధారణ కలుపు నివారణకూ ఉపయోగిస్తున్నారు. దీన్ని నియంత్రించాలనే తూతూమంత్రపు ఆదేశాలను ఖాతరు చేయని వ్యాపారులు.. కాసులకు కక్కుర్తి పడి ఈ విషాన్ని రైతులకు అంటగడుతున్నారు. 

గ్లైఫోసేట్‌తో కేన్సర్‌.. నిర్ధారించిన డబ్ల్యూహెచ్‌వో 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆధ్వర్యంలోని అంతర్జాతీయ కేన్సర్‌ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌సీ) కూడా గ్లైఫోసేట్‌తో కేన్సర్‌ వచ్చే అవకాశముందని 2015లోనే నిర్ధారించింది. ఇటీవల అమెరికాలోనూ ఈ విషయం నిర్ధారణ అయింది. దీన్ని తయారు చేసిన మోన్‌శాంటో మాత్రం గ్లైఫోసేట్‌తో కేన్సర్‌ వస్తుందన్న వాదనలను తిరస్కరిస్తూ వచ్చింది. అయితే ఇటీవల మోన్‌శాంటో అంతర్గత నివేదిక బట్టబయలు కావడంతో గ్లైఫోసేట్‌ ప్రమాదకరమైనదని వెల్లడైంది. గ్లైఫోసేట్‌ను 130 దేశాల్లో దాదాపు వంద పంటలకు వినియోగిస్తున్నారు. దీంతో గ్లైఫోసేట్‌ అనే మందు ఆహారం, నీరు, వ్యవసాయ కూలీల మూత్రంలోనూ కనిపిస్తోంది. ఈ కలుపు మందును బీజీ–3 పత్తికి వేస్తే, పక్కనున్న ఇతర పంటలపైనా ప్రభావం చూపుతుంది. అవి విషపూరితమవుతాయి. అవి తిన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుంది. 

చిట్టీ రాసిస్తే చాలు 
మండల వ్యవసాయాధికారుల అండదండలతో నిషేధిత గ్లైఫోసేట్‌ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. బీజీ–3 పత్తి విత్తన సాగును అరికట్టేందుకు గ్లైఫోసేట్‌ను నియంత్రించిన ప్రభుత్వం.. తిరిగి అధికారులతోనే వాటి విక్రయాలు జరిపేలా వెసులుబాటు కల్పించింది. ‘మండల వ్యవసాయాధికారులు చిట్టీ రాసిస్తే.. ఆ ప్రకారం రైతులు గ్‌లైఫోసేట్‌ను కొనుక్కోవచ్చు. ఆ చిట్టీని చూసి పురుగుమందుల డీలర్లు రైతులకు అమ్ముకోవచ్చు’అని వ్యవసాయ శాఖ ఇచ్చిన వెసులుబాటు దుమారం రేపుతోంది. మరోవైపు దేశంలో తేయాకు తోటలకు, బీడు భూముల్లో పిచ్చి చెట్ల నిర్మూలనకు గ్‌లైఫోసేట్‌ను ఉపయోగించవచ్చని, ఆ ప్రకారం రైతులు కోరితే మండల వ్యవసాయాధికారులకు చిట్టీ రాసిస్తారని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 43 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, అందులో సుమారు 10 లక్షల ఎకరాల్లో అనుమతి లేని బీజీ–3 పత్తి వేసినట్లు అంచనా. బీజీ–3లోని కలుపు నివారణకు గ్లైఫోసేట్‌ను వాడుతున్నారు. 

కేసుల్లేవ్‌.. 
మరోవైపు గ్‌లైఫోసేట్‌ విక్రయించే డీలర్లపైనా అధికారులు ఎలాంటి కేసులు పెట్టడంలేదు. లైసెన్సుల రద్దు లేదు. వాస్తవానికి గ్‌లైఫోసేట్‌ను స్వాధీనం చేసుకుంటే ఆ కలుపు మందును అత్యంత సురక్షిత ప్రాంతంలో ధ్వంసం చేయాలి. కానీ అవేవీ చేయడంలేదు. వ్యవసాయ శాఖ చేపట్టిన ఈ చర్యలతో బీజీ–3 విత్తనానికి మరింత ప్రోత్సాహం లభించినట్లయింది. 

ఉద్యాన పంటల్లోనూ వాడకం 
రాష్ట్రంలో పండ్ల తోటలు, చెరువు గట్లు, హరితహారం చెట్ల వద్ద కలుపు ఏపుగా పెరుగుతుంది. చెరువుల్లో గుర్రపు డెక్క కూడా పెరుగుతుంటుంది. ఈ కలుపును నివారించడానికి కూలీలు దొరకడంలేదు. కూలీల కొరత కారణంగా కలుపు నివారణకు రైతులు విరివిగా గ్‌లైఫోసేట్‌ మందును వాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో గ్‌లైఫోసేట్‌ మందును నిషేధిస్తే ఆయా రైతులు అన్యాయమైపోతారని ఉద్యాన శాఖాధికారులు విన్నవిస్తున్నారు. గ్‌లైఫోసేట్‌పై నిషేధం వద్దని కోరుతున్నారు. బొప్పాయి, నిమ్మ, జామ, మామిడి తదితర పంటల మధ్య కలుపు తొలగించేందుకు రైతులంతా గ్‌లైఫోసేట్‌నే వాడుతున్నారని ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి. కేవలం తేయాకు తోటల్లో కలుపు నివారణ వరకే కేంద్ర ప్రభుత్వం గ్‌లైఫోసేట్‌ను అమనుతిస్తే.. పండ్ల తోటలు, ఇతర వాటికి కూడా వినియోగించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 

తూతూమంత్రపు దాడులు 
గ్లైఫోసేట్‌ అమ్మకాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ టీంలను ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో నియంత్రించడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారు. లక్షలాది లీటర్ల విక్రయాలు జరుగుతుంటే, ఇప్పటివరకు కేవలం 68,766 లీటర్ల గ్‌లైఫోసేట్‌ను మాత్రమే వ్యవసాయ శాఖ వర్గాలు పట్టుకున్నాయి. వాటిని పట్టుకున్నారే కానీ ఎక్కడా సీజ్‌ చేయకపోవడం గమనార్హం. భద్రంగా పురుగు మందుల డీలర్ల వద్దే వాటిని ఉంచుతున్నారు. పేరుకు వేలాది లీటర్లు పట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా వ్యవసాయ వర్గాలు నోరెళ్లబెడుతున్నాయి. దీంతో గ్రామాల్లో విషం ఏరులై పారుతోంది. 

విచ్చలవిడి విక్రయాలు: డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు 
తూతూమంత్రంగానే గ్లైఫోసేట్‌పై దాడులు జరుగుతున్నాయి. పైపై నియంత్రణ చర్యలే కానీ కఠినంగా వ్యవహరించడంలేదు. నియంత్రణ ఆదేశాలు కలెక్టర్లకు ఇచ్చినా వారు పట్టించుకోవడంలేదు. గ్‌లైఫోసేట్‌ విక్రయాల్లో కంపెనీలు పెద్ద ఎత్తున లాబీయింగ్‌ జరుపుతున్నాయి. విచ్చలవిడిగా అమ్ముకుంటున్నాయి.  

గ్లైఫోసేట్‌తో అనారోగ్యం: డాక్టర్‌ నరేందర్, హైదరాబాద్‌ 
గ్లైఫోసేట్‌తో తీవ్రమైన అనారోగ్యం కలుగుతుంది. కేన్సర్‌తోపాటు కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముంది. గ్లైఫోసేట్‌ వాడకం వల్ల రైతుల ఆరోగ్యంపైనా, తినే తిండిపైనా ప్రభావం చూపుతుంది. ఆహారం విషంగా మారుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top