రోగులకు స్టెరాయిడ్స్‌ దారుణం

Giving Steroids To The Patients Is Worse - Sakshi

జిల్లా వైద్యారోగ్య అధికారి డా. శ్రీనివాసులు

పీఎంపీలకు అవగాహన సదస్సు  

ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగితే సహించబోం

సాక్షి, వనపర్తి: రోగం నయం చేసేందుకు అనుభవ రాహిత్యంతో రోగులకు స్టెరాయిడ్స్‌ ఇవ్వడం దారుణమని, దీనివల్ల వారి శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని డీఎంహెచ్‌ఓ డా. అల్లె శ్రీనివాసులు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంబీ గార్డెన్స్‌లో జిల్లాలోని ప్రాథమిక మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌కు వైద్యసేవలు అందించడంపై అవగాహన కల్పించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగితే సహించేదిలేదని హెచ్చరించారు. కొందరు మంచిసేవలు అందిస్తున్నారని, మరికొందరు డబ్బుకు ఆశపడి పరిధికి మించి చికిత్స చేస్తున్నారని అన్నారు. ఎండీ స్థాయి వైద్యులే ఇవ్వడానికి భయపడే చికిత్సలు, మందులను గ్రామాల్లో పీఎంపీలు యథేచ్ఛగా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి 14 ఆస్పత్రులను సీజ్‌ చేశామని చెప్పారు. రోగులు వైద్యసేవలకు వస్తే మీ పరిధిలోనే వైద్యం అందించాలని సూచించారు. అప్పటికీ మెరుగు కాకుంటే రెఫర్‌ చేయాలన్నారు.

40– 60శాతం కమీషన్ల ప్రకారం దోపిడీకి పాల్పడుతున్న ల్యాబ్‌లను సీజ్‌ చేసినట్లు చెప్పారు. జ్వరంతో బాధపడుతున్న 24మందికి పీఎంపీ సెలైన్స్‌ ఎక్కించడం దారుణమని అన్నారు. అందుకే సీజ్‌ చేశామని తెలిపారు. జిల్లాలో కలెక్టర్‌ నిఘా ఉందని చెప్పారు. ఇప్పటికైనా పరిధిలో ఉండకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా నుంచి పక్క రాష్ట్రానికి తీసుకెళ్లి అబార్షన్‌ చేయడం, లింగనిర్ధారణ చేసి భ్రూణహత్యలకు పాల్పడం కొందరు చేస్తున్నారని, ఇంకొందరు కేవలం మగపిల్లలు పుట్టేందుకు చికిత్సలు అందిస్తామని నమ్మబలికి రూ.లక్షలు వసూలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై నిఘాఉందని, అలాగే మొబైల్‌ స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు పట్టుబడితే వదిలిపెట్టబోమని చెప్పారు. కార్యక్రమంలో డీపీహెచ్‌ఓ డా.రవిశంకర్, ఇన్‌చార్జ్‌ డీఐఓ డా.శంకర్, సిబ్బంది నర్సింహారావు, మద్దిలేటి, పీఎంపీ జిల్లా కమిటీ అధ్యక్షుడు ఆనంద్, ప్రధాన కార్యదర్శి డానియేల్, పట్టణ అధ్యక్షుడు గంధం ప్రసాద్, సురేష్, బాషానాయక్, ఇంతియాజ్, పీఎంపీలు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top