
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత వర్షాకాల సీజన్‌తో పాటు ఆకస్మికంగా సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు వివిధ శాఖలు మరింత సమన్వయంతో పనిచేయాలని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వర్షాకాల విపత్తుల నివారణ ప్రణాళిక సమావేశంలో పలు శాఖల ఉన్నతాధికారులు నిర్ణయించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ, జలమండలి, మెట్రో రైలు, విద్యుత్ తదితర విభాగాల్లో దాదాపు 300 విపత్తు నివారణ ప్రత్యేక బృందాలు ఉన్నాయని తెలిపారు. నగరంలో ఎలాంటి విపత్తులు ఎదురైనా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి నగరవాసుల్లో విశ్వాసం నింపాలని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో ప్రధానంగా 195 ప్రదేశాలను నీటిముంపు ప్రాంతాలుగా గుర్తించామని, వర్షాల సమయంలో ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఈ ప్రదేశాల్లోని మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్‌లను మరోసారి తనిఖీలు చేయాలని, సమీప నాలాల్లో పూడిక, వ్యర్థాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రహదారులపై 150 ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు చేయాలని ట్రాఫిక్ విభాగం అడిషనల్ కమిషనర్ అనీల్ కుమార్ సూచించారు. మెట్రో రైలు వంతెనల పైనుంచి రోడ్లపైకి ప్రవహిస్తున్న వర్షపు నీటిని నివారించాలని కోరారు.
వారంలోగా రోడ్ల తవ్వకాలు పూడ్చాలి..
నగరంలో వివిధ ఏజెన్సీలకు గతంలో జారీచేసిన రోడ్డు తవ్వకాల అనుమతులకు సంబంధించి ఆయా రోడ్ల నిర్మాణ పనులను వారం రోజుల్లోగా పూర్తిచేయాలని కమిషనర్ దానకిశోర్ ఆదేశించారు. రోడ్లు తవ్వి పునరుద్ధరణ చేయని ఏజెన్సీలపై చర్యలు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. ఆయా శాఖ వద్ద ఉన్న ఎమర్జెన్సీ బృందాలను సమావేశపరచి విపత్తుల సమయంలో సమన్వయంతో పనిచేసేందుకు తగు శిక్షణనివ్వాలని దానకిశోర్ సూచించారు. çసమావేశానికి హైదరాబాద్ జేసీ రవి, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అడిషనల్ సీపీ అనీల్‌కుమార్, సైబరాబాద్ డీసీపీ విజయ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి, జలమండలి, రెవెన్యూ, ట్రాన్స్‌కో, వాతావరణ శాఖ, నీటి పారుదల శాఖ, ఫైర్ సర్వీసులు, ఆర్టీసీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రూ. 17.50 లక్షల విలువైన పరికరాల అందజేత..
ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో ఆకస్మిక వర్షాలు, ఇతర విపత్తుల సమయంలో ఉపయోగించడానికి వీలుగా రూ.17.50 లక్షల విలువైన పరికరాలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగానికి జీహెచ్‌ఎంసీ అందజేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్, సిటీ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం అడిషనల్ íసీపీ అనీల్‌కుమార్‌లు వీటిని అందజేశారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్, సైబరాబాద్ డీసీపీ విజయ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.