జీఐఎస్‌ సబ్‌స్టేషన్‌ సక్సెస్‌

Gas Insulated Substation charging successfully - Sakshi

విజయవంతంగా చార్జింగ్‌ చేసిన ట్రాన్స్‌కో

సీఎం కేసీఆర్‌ అభినందనలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్మించిన తొలి 400 కేవీ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ (జీఐఎస్‌)ను తెలంగాణ విద్యుత్‌ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) విజయవంతంగా చార్జింగ్‌ చేసింది. విద్యుత్‌ సౌధలోని లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ నుంచి ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం రిమోట్‌ ద్వారా ఈ సబ్‌స్టేషన్‌కు చార్జింగ్‌ నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా భూగర్భంలో 120 మీటర్ల దిగువన నిర్మిస్తున్న మేడారం లిఫ్టుకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు రూ.430 కోట్ల వ్యయంతో ఈ సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో నిర్మించింది. మేడారం లిఫ్టులకు అనుసంధానంగా సబ్‌స్టేషన్‌ను భూగర్భంలో నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది.

ఫీడర్ల మధ్య నిర్దిష్ట దూరంతో సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి కనీసం 30 ఎకరాల స్థలం అవసరం కాగా, భూగర్భంలో మేడారం లిఫ్టునకు అనుసంధానంగా సబ్‌స్టేషన్‌ నిర్మించడానికి అంత స్థలం అందుబాటులో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తక్కువ స్థలంలో నిర్మించేందుకు వీలు కలిగిన గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ను మేడారంలో ట్రాన్స్‌కో నిర్మించింది. 3 వేల గజాల స్థలంలో ఈ సబ్‌స్టేషన్‌ నిర్మాణాన్ని 5 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసింది. ఈ సబ్‌ స్టేషన్‌లోని ఫీడర్ల మధ్య తక్కు వ దూరం ఉన్నా, వాటి ద్వారా ప్రవహించే విద్యుత్‌ పరస్పరం సంపర్కంలోకి రాకుండా ఫీడర్ల మధ్య సల్ఫర్‌ హెగ్జాఫ్లోరైడ్‌ గ్యాస్‌ విద్యు త్‌ నిరోధకంగా పని చేయనుంది. ఈ తరహా సబ్‌స్టేషన్‌ దేశంలో మూడోది అని, రాష్ట్రంలో నిర్మించడం ఇదే తొలిసారి అని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు.  

870 మెగావాట్ల విద్యుత్‌..
మేడారం పంపింగ్‌ స్టేషన్‌లో 124.4 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేస్తున్న 7 పంపులకు ఈ సబ్‌స్టేషన్‌ ద్వారా 870.80 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా కానుంది. ఈ సబ్‌స్టేషన్‌లో 160 ఎంవీఏ సామర్థ్యం కలిగిన ఏడు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 25 ఎంవీఏల సామర్థ్యం కలిగిన రెండు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. రామడుగు 400/33 కేవీ సబ్‌ స్టేషన్‌ నుంచి భూగర్భంలోని మేడారం సబ్‌స్టేషన్‌ వరకు 20.3 కి.మీల 400 కేవీ క్యూఎండీసీ విద్యుత్‌ లైన్‌ నిర్మాణం కోసం 2,500 ఎస్‌క్యూఎంఎం కేబుల్‌ను వినియోగించారు. జీఐఎస్‌ సబ్‌స్టేషన్‌ చార్జింగ్‌ విజయవంతం కావడంతో ట్రాన్స్‌కో సీఎండీ, విద్యుత్‌ శాఖకు సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top