జియో–బీపీ తాజాగా వివిధ రకాల ఇంధనాలతో పాటు చార్జింగ్ పాయింట్లు కూడా ఒకే చోట అందుబాటులో ఉండేలా బెంగళూరులో భారీ స్థాయి సమగ్ర మొబిలిటీ హబ్‌ను తీర్చిదిద్దింది. ఇందులో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ విక్రయిస్తుండగా, ఈవీ చార్జింగ్ హబ్‌ను కూడా ఏర్పాటు చేసింది.
ఈ ఔట్‌లెట్‌లో 28 చార్జింగ్ పాయింట్లు, కేఫ్ ఉంటాయని సంస్థ చైర్మన్ సార్థక్ బెహూరియా తెలిపారు. 360 కిలోవాట్ల సూపర్‌ఫాస్ట్ చార్జర్లతో వేగవంతంగా వాహనాన్ని చార్జ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. భారత్‌లో ఈ తరహా భారీ సమగ్ర హబ్ ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని సంస్థ తెలిపింది. జియో–బీపీకి దేశవ్యాప్తంగా 1,000 ప్రాంతాల్లో 7000 చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి.


