ఉద్యోగుల పంపిణీ మరింత జాప్యం | Further delays in the distribution of employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల పంపిణీ మరింత జాప్యం

Dec 18 2014 1:48 AM | Updated on Jul 29 2019 5:59 PM

ఇప్పటికే కమలనాధన్ కమిటీ 44 శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి పోస్టులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య ఉద్యోగుల పంపిణీ మరింత జాప్యం కానుంది. ఇప్పటికే కమలనాధన్ కమిటీ 44 శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి పోస్టులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి పది రోజుల సమయం ఇచ్చింది. ఇందులో అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి 32 శాఖలకు ఇచ్చిన గడువు కూడా ముగిసింది.

కమలనాధన్ కమిటీ ఈ పోస్టుల తుది పంపిణీతోపాటు రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీని కూడా తాత్కాలికంగా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అంగీకరించారు. దీంతో కమలనాధన్ కమిటీ ఇరు రాష్ట్రాలకు చెందిన శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై అభ్యంతరాలు లేని శాఖలకు చెందిన పోస్టులతోపాటు ఉద్యోగులను కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

అయితే కేంద్ర వ్యక్తిగత సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం అభ్యం తరం వ్యక్తం చేసింది. ఈ మేరకు అధికారులు కమలనాధన్‌కు బుధవారం తెలియజేశారు. పోస్టులతోపాటు ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ అంశానికి చెందిన ఫైలును ప్రధాని ఆమోదానికి పంపుతామని, అప్పటివరకు పంపిణీ చేయరాదని తెలిపారు. దీంతో ఉద్యోగుల తాత్కాలిక పంపిణీకి ప్రధానమంత్రి నుంచి ఆమోదం లభించిన తరువాతనే పోస్టుల తుది పంపిణీని ఉద్యోగుల తాత్కాలిక పంపిణీని ఒకేసారి చేయాలని కమలనాధన్ కమిటీ నిర్ణయించింది. దీంతో పోస్టుల పంపిణీ, ఉద్యోగుల పంపిణీ మరింత జాప్యం కానుందని అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement