ఎస్సారెస్పీ పూర్తి ఆయకట్టుకు నీరు 

Full of water to ASRSP - Sakshi

నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు 

ప్రాజెక్టు ఆధునీకరణ పనుల వేగం పెంచాలని అధికారులకు సూచన 

అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష 

అల్గునూర్‌(మానకొండూర్‌): ఎస్సారెస్పీ పూర్తి ఆయకట్టుకు ఈ ఖరీఫ్‌లో నీరందించాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా కాలువల ఆధునీకరణ పనుల వేగం పెంచాలని సూచించారు. అయితే ప్రస్తుతం ఎస్సారెస్పీ ప్రాజెక్టులో తగినన్ని నీటి నిలువలు లేనందున ఇప్పటికిప్పుడే నీటి విడుదల సాధ్యం కాదని, రైతులు దీనిని అర్థం చేసుకోవాలని కోరారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని ఎస్సారెస్పీ అతిథి గృహంలో మంగళవారం మంత్రి.. అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఎస్సారెస్పీతోపాటు, ఎల్లంపల్లి, మధ్యమానేరు ప్రాజెక్టుల కింద చేపట్టిన పనులు, వాటి పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సారెస్పీ కాలువల ఆధునీకరణ పనుల వేగం పెంచాలన్నారు.

ఈ ఏడాది ఖరీఫ్‌లోనే ప్రాజెక్టు పూర్తి ఆయకట్టుకు నీరందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారని, నెలరోజుల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. మానకొండూర్‌ నియోజకవర్గ పరిధిలో పనులు నత్తనడకన సాగడంపై మంత్రి అసం తృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎస్సారెస్పీ అధికారులు పనులను పర్యవేక్షించాలని సూచించారు. వేగం పెంచకుంటే కాంట్రాక్టర్‌ను మార్చాలని ఆదేశించారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు కాలువల పనులుపై ఆరా తీశారు. ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో కల్పించిన సౌకర్యాలు, ఇంకా కల్పించాల్సిన వసతులు, పరిహారం తదితర అంశాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద పనులు, కాలువల నిర్మాణం, నీటి విడుదల, ఆయకట్టు పరిస్థితి గురించి తెలుసుకున్నారు.  

ఎల్లంపల్లి ఆయకట్టుకు సాగునీరు.. 
ఎల్లపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 15 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు. ఈ నెలలో మంచి వర్షాలు కురిస్తే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందని, ఆయకట్టుకు సాగు నీటిని విడుదల చేయాలని మంత్రి హరీశ్‌ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని చెరువులు నింపాలని సూచించారు. ఎస్సారెస్పీలోకి ఈనెలలో భారీగా నీరు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఎస్సారెస్పీ నుంచి ఇప్పుడే నీటి విడుదల సాధ్యం కాదు.. 
ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ప్రస్తుతం 15 టీఎంసీల నీరుమాత్రమే ఉందని, ఈ పరిస్థితుల్లో పంటలకు నీరివ్వడం సాధ్యం కాదని మంత్రి హరీశ్‌ స్పష్టం చేశారు. ఉన్న నీటిలో మిషన్‌ భగీరథ కోసం 6 టీఎంసీలు వినియోగిస్తామని, మరో నాలుగు టీఎంసీలు ఆవిరి నష్టాలు ఉంటాయని తెలిపారు. ఈ తరుణంలో నీటిని విడుదల చేస్తే తాగునీటి సమస్య తలెత్తుతుందన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. విపక్షాలు నీటి విడుదలపై రాజకీయం చేయడం సరికాదని సూచించారు. ప్రాజెక్టు పరిస్థితిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గతేడాది 40 టీఎంసీల నీరు చేరితే రెండు పంటలకు నీరు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈనెలాఖరులోగా ప్రాజెక్టులోకి భారీ వరద వస్తుందనే నమ్మకం ఉందన్నారు. రైతులు వరి కాకుండా ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top