ఆ నాలుగూ.. ఇవేనా!

Four Missing Leopards Catch Forest Department - Sakshi

రెండు రోజుల క్రితం రాజీపేటతండాలో పట్టుబడిన చిరుత   

రెండు నెలల క్రితం నల్గొండ జిల్లా అజిలాపూర్‌లో ఒకటి

ఐదు నెలల కింద షాద్‌నగర్‌లో మరొకటి

తాజాగా రాజేంద్రనగర్‌లో సంచరిస్తున్న ఇంకో చిరుత

యాచారం: జిల్లాలోని ఐదు మండలాల్లో సంచరిస్తున్న చిరుతల బాధ తీరినట్లేనని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. రెండేళ్లుగా యాచారం, మాడ్గుల్, కందుకూర్, కడ్తాల్, ఆమన్‌గల్, షాదనగర్‌ మండలాల్లోని 30 వేల ఎకరాలకు పైగా ఉన్న అటవీ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నాయి. మొదట్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ అటవీ ప్రాంతం నుంచి రెండు చిరుతలు వచ్చాయని.. ఇవి యాచారం, మాడ్గుల్, కందుకూర్‌ మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో తిరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. సమీప గ్రామాల వ్యవసాయ బావుల వద్ద ఉన్న పశువులు, మేకలు, గొర్రెలపై దాడులు చేస్తూ ఆకలి తీర్చుకున్నాయి. ఏడాది తర్వాత వీటి సంతతి పెంచుకున్నాయని, మొత్తం నాలుగు చిరుతలు ఉన్నాయని పాదముద్రల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుతల సంతతి మరింత పెరిగితే అత్యంత ప్రమాదమని గుర్తించి, వీటిని పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం రెండేళ్లుగా రూ.20 లక్షలకు పైగా ఖర్చు చేసి రెండు ప్రత్యేక టీంలు, రెండు వాహనాలు, సీసీ కెమెరాలు, పలు స్థలాల్లో పదికి పైగా బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతలను పట్టుకోవడానికి జూ పార్క్‌ నుంచి ప్రత్యేక నిపుణులను రప్పించినా ఫలితంలేకపోయింది.

60కి పైగా దాడులు...
ఐదు మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో సంతతి పెంచుకున్న చిరుతలు సమీప గ్రామాల్లో రెండేళ్లుగా 60కి పైగా దాడులు చేశాయి. దాడులు చేసిన సమయాల్లో ఒకటి నుంచి నాలుగు వరకు లేగదూడలు, మేకలు, గొర్రెలను చంపి, తిన్నాయి. చిరుతల దాడులతో వంద మందికి పైగా రైతులు నష్టపోయారు. దీంతో చిరుతలకు ఆహారంగా అటవీ ప్రాంతంలో అధికారులు 60 జింకలను వదిలారు. అటవీ శాఖ చట్టం ప్రకారం బాధిత రైతులకు రూ.5 లక్షల వరకు పరిహారం చెల్లించారు. ఐదు మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతం శ్రీశైలం రహదారి నుంచి, నాగార్జునసాగర్‌ రహదారి వరకు విశాలమైన అటవీ ప్రాంతం ఉంది. చిరుతలు నిత్యం 20 నుంచి 30 కిలోమీటర్లకు పైగా నడుస్తాయి. ఆకలి తీర్చుకోవడం కోసం నడిచే క్రమంలో ఎదైనా దొరికితే సరి లేదంటే 50 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణిస్తాయని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. 

ఇక్కడి నుంచి వెళ్లినవే కావచ్చు...
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పక్కనే ఉంది. ఐదు నెలల కింద మర్రిగూడ మండలం అజిలాపూర్‌ వద్ద, రెండు రోజుల క్రితం అదే మండలం రాజీపేటతండా వద్ద పట్టబడిన చిరుతలు ఇక్కడి నుంచి వెళ్లినవే కావచ్చని, అదే విధంగా ఆరు నెలల కింద షాద్‌నగర్‌లో పట్టుబడిన చిరుత, తాజాగా రాజేంద్రనగర్‌లో సంచరిస్తున్న చిరుత కూడా ఇక్కడి నుంచి వెళ్లినదే కావచ్చని ఫారెస్ట్‌ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలోని ఐదు మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో పిల్లలతో సహా నాలుగు చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించడం, ఆ నాలుగు చిరుతల్లో ఒకటి మృతి చెందడం, రెండు చిరుతలను పట్టుకుని జూకు తరలించడం, మరో చిరుత రాజేంద్రనగర్‌లో సంచరిస్తుండడం వల్ల యాచారం, మాడ్గుల్, కందుకూర్, ఆమన్‌గల్‌ మండలాల రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గుర్తించిన నాలుగు చిరుతల జాడ తెలియడంతో ఇక బాధ తప్పినట్లేనని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top