చంద్రబాబును పార్టీ అధ్యక్షుడిని చేసింది ఆయనే!

Former MP Manik Reddy Funeral Completed - Sakshi

మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

నివాళులర్పించిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు,  వైఎస్సార్‌సీపీ నాయకులు

అంత్యక్రియల్లో పాల్గొన్న గ్రామస్తులు, తదితరులు

జోగిపేట(అందోల్‌) : టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి (77) ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటలకు గుండెపోటుతో మరణించారు.  ఆయన అంత్యక్రియలను స్వగ్రామమైన అందోలు మండలం డాకూరు గ్రామంలో నిర్వహించారు.   సీఎం కే.చంద్రశేఖర్‌రావు  మాణిక్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం డాకూరుకు రోడ్డు మార్గంలో వస్తున్నట్లు ముందుగానే సమాచారం రావడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖమంత్రి టీ.హరీష్‌రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు íపీ.బాబూమోహన్, చింతాప్రభాకర్, మదన్‌రెడ్డి, రామలింగారెడ్డి, భూపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరీదొద్దిన్, భూపాల్‌రెడ్డి, పల్లా రాజేశ్వరరావు,  జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, జాయింట్‌ కలెక్టర్‌ నిఖిలారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర్‌ రాజనర్సింహ, ఎంపీలు బీబీ పాటిల్, ప్రభాకర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మెన్లు సుభాష్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి బీ.సంజీవరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర టీయుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్, రాష్ట్ర టీఆర్‌ఎస్‌ నాయకులు బక్కి వెంకటయ్య, సపానదేవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నరహరి,  సీడీసీ చైర్మన్‌ విజయేందర్‌రెడ్డి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

వర్షంలోనే అంత్యక్రియలు

మాణిక్‌రెడ్డి మృతదేహాన్ని అంత్యక్రియలకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో వర్షంలోనే అంత్యక్రియలు జరిపారు. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అలాగే ముందుకు కదిలారు. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు  అక్కడే ఉన్నారు. అంత్యక్రియలకు వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది తరలి వచ్చారు.

మాణిక్‌రెడ్డి మరణం తీరనిలోటు : వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవరావు

జోగిపేట(అందోల్‌): మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి ఆకస్మిక మరణం జిల్లాకు తీరనిలోటని రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సంజీవరావు అన్నారు. ఆదివారం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు డాకూరు గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 38 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారని, మంచి అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయామన్నారు. సర్పంచ్‌ స్థాయి నుంచి ఎంపీ పదవి వరకు ఎన్నో ఉన్నతమైన పదవులను అధిరోహించారన్నారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాట్లు తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు పరిపూర్ణ, రాజు, నరేష్, బాగయ్యలతో పాటు పలువురు  ఉన్నారు.జిల్లా రాజకీయాల్లో కీలక పాత్రజోగిపేట(అందోల్‌): మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సంపాదించారు. ఒకస్థాయిలో జిల్లాను శాసించే స్థాయికి ఎదిగారు.  గ్రామ స్థాయి సర్పంచ్‌ నుంచి పార్లమెంట్‌ సభ్యుడి వరకు ఎదిగారు. మాజీ మంత్రి రాజనర్సింహ శిష్యుడిగా రాజకీయాల్లో గుర్తింపు పొందారు.

పంచాయతీ సమితి అధ్యక్ష పదవి కోసం నియోజవర్గంలో ఎంతో మంది ఆశ పడ్డ ఆయన మాణిక్‌రెడ్డికే మద్దతు ఇవ్వడంతో పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ఆ పదవి దోహదపడిందని చెప్పవచ్చు. యూత్‌ కాంగ్రేస్‌ జిల్లా నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఏదో ఒక పదవిలో ఉండి అధికారంలో ఉన్నారు. అప్పటి కేంద్రమంత్రి శివశంకర్‌పై పోటీ చేసి గెలుపొందడంతో ఢిల్లీలో మంచి గుర్తింపు పొందారు. రాజీవ్‌ గాంధీపై భూఫోర్స్‌ కేసులో చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌లో ఏడాది కాలం మిగిలి ఉండగానే ఎన్టీరామారావు ఆదేశానుసారం తన రాజీనామా లేఖను అందరి కంటే ముందుగానే లోకసభ స్పీకర్‌కు అందజేసి దేశ స్థాయిలో గుర్తింపు పొందారు.

కేసీఆర్‌తో అనుబంధం

ప్రస్తుత సీఎం కేసీఆర్‌తో మాణిక్‌రెడ్డికి చాలా దగ్గరి అనుబంధం ఉంది. తెలుగుదేశం పార్టీలో 20 సంవత్సరాలకుపైగా కలిసి పని చేశారు. ఉమ్మడి జిల్లాకు కూడా టీడీపీ అధ్యక్షుడిగా మాణిక్‌రెడ్డి పని చేశారు. 1998లో జరిగిన అందోలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బాబూమోహన్‌ గెలుపు బాధ్యతను చేపట్టిన కేసీఆర్‌ అప్పట్లో రాష్ట్ర రవాణా శాఖా మంత్రిగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో 26 రోజుల పాటు మాణిక్‌రెడ్డి స్వగ్రామమైన డాకూర్‌లోనే మకాం ఏర్పాటు చేసుకున్నారు. 

చంద్రబాబును పార్టీ అధ్యక్షుడిని చేసింది మాణిక్‌రెడ్డియే..

రాష్ట్రంలో 1994వ సంవత్సరంలో తిరిగి టీడీపీ అధికారాన్ని చేపట్టిన తర్వాత కొంత కాలానికే పార్టీలో సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మాణిక్‌రెడ్డి రాష్ట్ర కమిటీలో కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఆయన రెవెన్యూ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వైపే ఉన్నారు. అప్పటికప్పుడు మాణిక్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు నాయుడిను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేశారు. 

రాష్ట్ర ఏర్పాటు సంబరాలు అందోలులోనే..

తెలంగాణ  రాష్ట్రం కోసం సుధీర్ఘంగా పోరాటం చేసిన కేసీఆర్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబరాలను మొదటగా అందోలు నియోజకవర్గంలోనే చేపట్టారు. ఈ సభకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌ హజరయ్యారు. ఈ సభ విజయవంతం చేసే బాధ్యతను మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డియే తీసుకున్నారు.  ఎన్నికలకు ముందు నిర్వహించిన ఈ సభ విజయవంతం కావడంతో కేసీఆర్‌ సంతోషాన్ని వ్యక్తం చేసి మాణిక్‌రెడ్డిని అభినందించారు. ఈ సభలోనే ప్రస్తుత ఎంపీ బీబీ పాటిల్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top