ఇమడలేకే లొంగిపోయాను! 

former Maoist Sudhakar and Neelima couple surrendered before the DGP - Sakshi

మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు సుధాకర్‌ వెల్లడి 

పార్టీ సిద్ధాంతాలు దారి తప్పాయి 

కుటుంబ పాలన, అక్రమ వసూళ్లకు పెద్దపీట 

సెంట్రల్‌ కమిటీ కూడా నియంత్రణ కోల్పోయిందని వివరణ 

డీజీపీ ఎదుట లొంగిపోయిన మాజీ మావోయిస్టు సుధాకర్, నీలిమ దంపతులు 

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు గతి తప్పాయని, ప్రజలకు దూరమైన మావోయిస్టులు వారిపైనే దాడులకు పాల్పడుతూ, అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారని ఆ పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు సత్వాజీ అలియాస్‌ సుధాకర్, అలియాస్‌ కిరణ్‌ అలియాస్‌ శశికాంత్‌ పేర్కొన్నారు. బుధవారం సుధాకర్‌ ఆయన భార్య అరుణ (అలియాస్‌ నీలిమ అలియాస్‌ మాధవి)తో కలసి డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయాడు. తాము లొంగిపోవడానికి కారణాలను సుధాకర్‌ మీడియాకు వివరించారు. ‘బిహార్, జార్ఖండ్‌ ప్రాంతాల్లో ప్రజలకు పార్టీ పూర్తిగా దూరమైంది. అక్కడి పార్టీ శ్రేణుల్లో కుటుంబ పాలన, బంధుప్రీతి, అక్రమ వసూళ్లు పెరిగిపోయాయి. తెలంగాణలో మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పని చేసిన నాకు ఎక్కడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కానరాలేదు. సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా బిహార్, జార్ఖండ్‌లో పనిచేసిన సమయంలో అడుగడుగునా సిద్ధాంతాల ఉల్లంఘన కన్పించింది.

తొలుత ఇది కిందిస్థాయి వరకే పరిమితమైందనుకున్నా.. అగ్రనాయకుల దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లా. వారికి కూడా అక్కడి అకృత్యాలపై నియంత్రణ లేదన్న సంగతి చాలా ఆలస్యంగా నాకు అర్థమైంది. పార్టీ విధానం మారాలని, ప్రజలకు దూరమవుతున్నామని పలుమార్లు సీనియర్లకు చెప్పి చూశాను. అయినా లాభం లేకపోయింది. పైగా ప్రజలపైనే దాడులు, వారి వద్దే అక్రమ వసూళ్లు నాలో కలత రేపాయి. పార్టీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో శారీరక వేధింపుల్లేవు. కానీ సంప్రదాయ సమాజంలో అనాదిగా వస్తున్న పితృస్వామ్యమే అక్కడా తిష్టవేసింది. దీనివల్ల మహిళా సభ్యులకు వివిధ రూపాల్లో ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడ్డ సమయంలో మా సోదరుడి వద్ద దొరికిన రూ.25 లక్షలు పార్టీవే. దానికి అన్ని లెక్కలు పార్టీ అకౌంట్స్‌ వద్ద ఉన్నాయి. నేనెప్పుడూ నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం డబ్బు వసూళ్లకు పాల్పడలేదు. నన్ను పార్టీ సస్పెండ్‌ చేయలేదు. పార్టీ విధానాలు నచ్చకే తప్పుకొంటున్నట్లు ఏడాదిగా చెబుతున్నా. నా భార్యతో కలిసి బయటకి వస్తున్నట్లు లేఖ రాసి వచ్చా’అని వివరించారు. 

అనారోగ్యం, విభేదాలే కారణం: అరుణ 
పార్టీలో పలువురి ఆధిపత్య ధోరణి నచ్చకే తాము బయటికి వచ్చామని అరుణ వివరించారు. వాస్తవ సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకంగా పార్టీ నడుచుకుంటోందని, దీనిపైనే విభేదించే పార్టీని వీడినట్లు తెలిపారు. పార్టీలో మహిళలపై శారీరకంగా అఘాయిత్యాలు జరగట్లేదని, అయితే ఆధిపత్యం చెలాయించడం, ఒత్తిళ్లు చేయడం వల్లే పలువురు మహిళా మావోయిస్టులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. 

వేధింపులతోనే మహిళా మావోలు ఆత్మహత్యలు: డీజీపీ 
మావోయిస్టు పార్టీ బలహీనపడిందని, మిలీషియా సంఖ్య 500కు పడిపోయిందని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. అగ్రనేతల్లో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని పేర్కొన్నారు. మహిళా దళ సభ్యులపై అకృత్యాలు పెరిగిపోయినట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. ఈ కారణంగానే పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయితే ఇవేమీ ఇంతకాలం వెలుగుచూడలేదన్నారు. ‘సత్వాజీ లొంగుబాటు వెనుక చాలా పెద్ద తతంగమే నడిచింది. ఏడాది కింద అతడి సోదరుడు లొంగిపోయిన సమయంలోనే పార్టీ తీరుపై సెంట్రల్‌ కమిటీ సభ్యుడు సత్వాజీ అలియాస్‌ సుధాకర్‌ అసంతృప్తితో ఉన్నట్లు తెలుసుకున్నాం. ఈ క్రమంలోనే ‘ఇంటర్‌ స్టేట్‌ పోలీస్‌ కో–ఆర్డినేషన్‌ అండ్‌ కో–ఆపరేషన్‌’లో భాగంగా తెలంగాణ పోలీసులు జార్ఖండ్‌ పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేసి వారి సహకారంతో సత్వాజీ లొంగుబాటు సఫలీకృతం చేయగలిగాం.

మావోయిస్టు పార్టీ అధినాయకత్వంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కీలకమైన దండకారణ్యంలోనూ ముఖ్యనేతలు సోనూ, దేవూజీల మధ్య, స్థానిక గిరిజన నేతలకు తెలంగాణ నాయకులకు మధ్య విభేదాలున్నాయి. మావోయిస్టు అగ్రనేత సంబాల కేశవరావు భార్య రామక్క (అలియాస్‌ శారద) 2010లో వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంది. బస్తర్‌కు చెందిన డీవీసీఎం చందన, కమాండర్‌ చుక్కీ, కోదాడకు చెందిన దళ సభ్యురాలు గడ్డం భాగ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న వారిలో ఉన్నారు. పార్టీ విధానాలు గతి తప్పుతున్న క్రమంలో చాలామంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా మావోయిస్టుల్లో కొనసాగుతున్న వారు లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. సుధాకర్‌ దంపతులపై ఉన్న రివార్డు (సుధాకర్‌పై రూ.25 లక్షలు, అరుణపై రూ.10 లక్షలు) మొత్తం రూ.35 లక్షలను వీరికే ఇస్తాం. ఆ డబ్బుతో వీరు కొత్త జీవితం మొదలుపెట్టొచ్చు. ఇక ఇతనిపై ఉన్న ఎన్‌ఐఏ కేసు మాత్రం సుధాకర్‌ న్యాయపరంగా ఎదుర్కోవాల్సిందే’అని డీజీపీ వివరించారు. సమావేశంలో ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్, అడిషనల్‌ డీజీపీ జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

అరుణ నేపథ్యమిదీ.. 
బిహార్, జార్ఖండ్‌ స్టేట్‌ కమిటీ సభ్యురాలుగా కొనసాగిన వైదుగుల అరుణ (అలియాస్‌ మాధవి, నీలిమ)ది వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం మామడపురం గ్రామం. 3వ తరగతి చదువుతున్నపుడే ఈమెకు బాల్య వివాహం జరిగింది. ఆ పెళ్లి అరుణకు ఇష్టం లేదు. 8వ తరగతిలో తమ గ్రామానికి వచ్చి విప్లవపాటలు పాడే మావోయిస్టు దళానికి ఆకర్షితురాలై దళంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1998లో సుధాకర్‌ను వివాహం చేసుకున్నారు.  

సుధాకర్‌ ప్రస్థానం ఇదీ! 
నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ గ్రామానికి చెందిన సుధాకర్‌ది బీద కుటుంబం. 7వ తరగతి వరకు గ్రామంలోనే చదువుకున్న సుధాకర్‌.. నిర్మల్‌లో 8 నుంచి ఇంటర్‌వరకు చదివాడు. 1983లో ఇంటర్‌ చదువుతున్న క్రమంలోనే రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యూ)లో చేరి చదువు ఆపేశారు. ఆర్‌ఎస్‌యూ జిల్లా కమిటీ కార్యదర్శి కటకం సుదర్శన్‌ వద్ద చేరి దళంలో కొరియర్‌గా చేరారు. ఇర్రి మోహన్‌రెడ్డి వద్ద ఆయుధాల తయారీలో శిక్షణ పొందాడు. బెంగళూరులోని స్థావరంలో ఆయుధాలు తయారుచేసి దేశంలోని పలు దళాలకు చేరవేసేవాడు. 1986లో అరెస్టయి 1989 వరకు జైలు శిక్ష అనుభవించారు. జైలులో ఉన్న సమయంలో వరవరరావుతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటి కొచ్చాక వరవరరావుతో కలసి రైతు కూలీ సంఘంలో పనిచేశారు. 1990లో చెన్నారెడ్డి హయాంలో మావోలపై నిషేధం ఎత్తివేసినపుడు అజ్ఞాతం నుంచి బయటకొచ్చారు.

ఇంద్రవెల్లి అమరుల స్మారక స్తూపం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించాడు. పోలీసుల ఒత్తిడితో తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. అక్కడి నుంచి 1990లో దళంలో సభ్యుడిగా చేరిన సుధాకర్‌ 1999 నాటికి ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోన్‌ కమిటీలో, సబ్‌ కమిటీ ఆన్‌ మిలిటరీ అఫైర్స్‌లో సభ్యుడిగా ఎదిగాడు. 2001–03లో దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా ఛత్తీస్‌గఢ్‌లో, 2003–13 వరకు దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా మిలిటరీ కమిషన్‌లో పనిచేశారు. 2013లో పదోన్నతిపై సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా ఈస్టర్న్‌ రీజనల్‌ బ్యూరో (ఈఆర్‌బీ)కి బదిలీ అయి బిహార్‌ రీజినల్‌ కమిటీలో పనిచేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top