స్వేచ్ఛా భారతమా..నీకు వందనం

Foreign Studets Celebrate international womens day In OU - Sakshi

ఇక్కడి మహిళలు అదృష్టవంతులు    

అన్నింటా సమాన అవకాశాలు

‘సాక్షి’తో విదేశీ విద్యార్థినులు.. 

తార్నాక: నేటి సమాజంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు విజయాలు సాధిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని దేశాల్లో వారికి ఎంతో గౌరవం లభిస్తుండగా.. మరికొన్ని దేశాలు వారిపై అంక్షలు విధిస్తూ స్వేచ్ఛను ఆంక్షల చట్రంలో బిగిస్తున్నాయి. ఈ విషయంలో భారత మహిళలకు మాత్రం కావాల్సినంత స్వేచ్ఛ ఉందని, ఈ దేశంలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులంటున్నారు విదేశీ విద్యార్థులు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న పలువురు విదేశీ విద్యార్థినులతో ‘సాక్షి’ ముచ్చటించింది. ఆ వివరాలు విద్యార్థుల మాటల్లోనే..

చాలా అదృష్టవంతులు  
మా దేశంతో పోలిస్తే భారతదేశంలో మహిళలు స్వేచ్ఛగా ఉంటారు. మా దేశంలో మహిళా దినోత్సవం నిర్వహించరు. అయితే రక్షణ, గౌరవం బాగానే లభిస్తుంది. అయితే ఎంత రక్షణ ఉన్నా స్వేచ్ఛగా ఉండే అవకాశం లేదు. అందుకే భారతీయ స్త్రీలు అన్ని విషయాల్లోనూ అదృష్టవంతులు.– రెవీనా సెమాల్, ఇథియోఫియా

ప్రభుత్వమే గౌరవిస్తుంది..
మా దేశంలో మార్చి 8న ‘మదర్స్‌డే’గాను, జూలై 27న ‘డాటర్స్‌డే’ గాను ఉత్సవాలు చేస్తారు. ఈ సందర్భాల్లో మహిళలందరికీ బహుమతులు ఇవ్వడంతో పాటు, సన్మానాలు చేస్తారు. ఈ కార్యక్రమాలు ప్రభుత్వ నిధులతోనేచేపడతారు. ప్రభుత్వమే మహిళలను గౌరవిస్తుంది.    – ఆజాదే ఫర్హాదీ, ఇరాన్‌

సమానత్వం ఉండదు..  
మా దేశంలో మహిళా దినోత్సవాలు ఉన్నతమైన హోదాలో ఉన్న వారికే పరిమితం. స్వేచ్ఛ విషయంలో భారత్‌లో పోలిస్తే మా దేశంలో కొంత నిర్బంధమే. పురుషులతో సమానం గా చూసే పరిస్థితి లేదు. ఒక సంస్థలో పనిచేసే స్త్రీలకు పురుషులతో సమానంగా వేతనాలు ఉండవు. అయితే స్త్రీలు హక్కులు సాధించుకునే విశగాస్వశక్తిగా ఎదగాలి.     – బొరాయ్‌ రోహిన్, ఇరాక్‌

ఇప్పటికీ స్వేచ్ఛ లేదు..
ఆఫ్రికాలోని టీ–చాంద్‌ దేశంలో పుట్టిన మేం బతుకు దెరువు కోసం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లాం. ఇక్కడా, ఇక్కడా నేను గమనించిందేంటంటే.. స్త్రీలపై నిర్బంధం కొనసాగడం. ఇప్పటికీ మా దేశంలో మహిళలకు స్వేచ్ఛ లేదు. మా దేశంలో మహిళా దినోత్సవాలు నిషిద్ధం. బయటకు వెళ్లాలంటే మాకంటే చిన్న వారైనా సరే ఒక మగతోడు ఉండాల్సిందే. చదువు కోసం వచ్చిన మాకు ఇక్కడున్న కొద్ది కాలమైన ఆనందంగా ఉంటాం. అందుకు భారతదేశానికి సల్యూట్‌.– నియిమా అక్బర్, దక్షిణాఫ్రికా

స్త్రీ స్వేచ్ఛలో భారత్‌ మిన్న..  
స్త్రీ స్వేచ్ఛలో భారత్‌ తరువాతే ప్రపంచంలోని మిగతా దేశాలు. మా దేశంలో అయితే స్త్రీలకు స్వేచ్ఛ లేకపోగా, అభద్రతా భావం కూడా ఎక్కువే. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీంతో మేం చాలా నిర్బంధంలో ఉంటాం. స్వేచ్ఛగా బయట తిరుగలేం. భారత్‌లో అలా కాదు.. స్త్రీలను ఎంతో గౌరవిస్తారు. అందుకే  ఇక్కడి సంస్కృతి అంటే నాకు చాలా ఇష్టం. – నసీబా, అఫ్ఘనిస్థాన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top