వరద కాలువలో చేపల పెంపకం!

Fishery in the SRSP Flood Canal - Sakshi

కసరత్తు చేస్తున్న అధికారులు 

మత్స్య సంపదను పెంచే యోచన

బాల్కొండ: శ్రీరాంసాగర్‌  ప్రాజెక్ట్‌ నుంచి మిగులు జలాలు  సద్వినియోగ పరచటానికి నిర్మించిన వరద కాలువలో చేప పిల్లలను పెంచటానికి ప్రభుత్వం కసరత్తు  చేస్తోంది.  రివర్స్‌ పంపింగ్‌ ద్వారా వరద కాలువ నీటితో నిండుకుండలా ఉండటంతో కాలువలో చేప పిల్లలను వదలడం వల్ల మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. నాలుగు రోజుల క్రితం మోటర్ల వెట్‌రన్‌ ద్వారా భారీగా వరదల కాలువలో కాళేశ్వరం నీళ్లు వచ్చి చేరాయి. దీంతో మత్స్యకారులు కాలువలో చేపల వేటను కొనసాగిస్తున్నారు.  కాలువలో చేపల పెంపకం ద్వారా మరింత ఉపాధి లభిస్తుందని ఉన్నత అధికారులు ఆలోచిస్తున్నారు. ఎస్సారెస్పీ వరద కాలువకు పునరుజ్జీవన పథకం ద్వారా  ఏడాదంతా నిండుకుండలా ఉండే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా ఇది వరకే చెరువుల్లో, రిజర్వాయర్లలో చేప పిల్లలను నూరు శాతం సబ్సిడీపై సరఫరా చేస్తోంది. వరద కాలువలో కూడా ఏడాదంతా  నీరు నిలిచే అవకాశం ఏర్పడటంతో వరద కాలువలో కూడ చేప పిల్లలను వదిలి చేపలను పెంచాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వరద కాలువలో ఎన్ని కిలోమీటర్ల మేర ఎంత స్థాయిలో నీరు నిల్వ ఉంటుందో లెక్కలను వేస్తోంది. విస్తీర్ణం,  నీటి నిల్వ ఆధారంగా కాలువలో చేప పిల్లలను వదిలి పెంచుతారు.  దీంతో మత్స్యకారులు ఉపాధి లభిస్తుంది.
 
హర్షం వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు... 
కాలువలో చేప పిల్లలను వదిలి పెంచడం కోసం ప్రభుత్వం ప్రతిపాదలను సిద్ధం చేయడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో చేపలను వేటాడుతూ 5 వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ప్రస్తుతం వరద కాలువలో కూడా చేప పిల్లలను వదలడంతో మరింత మందికి ఉపాధి లభిస్తుందని మత్స్యకారులు అంటున్నారు.  ప్రభుత్వం వెంటనే స్పందించి  వరద కాలువలో చేప పిల్లలను వదలాలని మత్స్యకారులు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.. 
వరద కాలువలో నీటి నిల్వ దృష్టిలో ఉంచుకుని చేప పిల్లలను వదలటానికి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నాం. ఉన్నత అధికారులు చేప పిల్లలను వదలడం గురించి చర్చిస్తున్నారు. నివేదికలను సిద్ధం చేసి త్వరలోనే చేపపిల్లలను వదులుతాం.   –రాజారాం, ఏడీ, మత్స్యశాఖ, నిజామాబాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top