మల్లన్న సన్నిధిలో వేదఘోష..

The first Veerasaiva school in Telangana - Sakshi

     వీరశైవ పంచమ గ్రంథాల పఠనం

     పాఠశాలలను మంజూరు చేసిన వైఎస్‌

     తెలంగాణలోనే తొలి వీరశైవ ఆగమ పాఠశాల

     దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకూ ఇక్కడే శిక్షణ

సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల్లో కాకతీయులు, ఇతర రాజులు వీరశైవ మతాన్ని ఆదరించారు.. ఊరూరా శివాలయాలు కట్టించారు. వాటిల్లో ధూప దీప నైవేద్యం పెట్టే హక్కు.. వీరశైవ పూజారులు జంగమ, బలిజ కులాలకు చెందిన వారికి వంశపారంపర్యంగా వస్తూ ఉండేది. అయితే మారిన కాలంతోపాటు, ఈ వృత్తిని ఆచరించేవారు కరువై.. తరతరాలుగా శివాలయాల్లో పూజలు చేసేవారి స్థానంలో వేరేవారు రావడం మొదలైంది. ఇటువంటి పరిస్థితిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శివాలయాల నిర్వహణ కోసం వీరశైవ ఆగమ పాఠశాలలు కావాలని 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని కోరగా అంగీకరించి మంజూరు చేశారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఈ పాఠశాలను ఏర్పాటు చేయగా వీరశైవ పంచాచార్య సంప్రదాయాల ప్రకారం బోధన జరుగుతోంది.

పంచపీఠాల పఠనం..
వీరశైవంలోని కీలకమైన కొలనుపాక, ఉజ్జయని, కేదారం, శ్రీశైలం, కాశీ పంచపీఠాల గురించి మొదట పరిచయం చేస్తారు. ఆరేళ్ల కోర్సుగా చెప్పే ఈ పాఠశాలలో తొలుత రెండేళ్లు అర్చక ప్రవేశం, మంత్రాలు, దేవాలయాల్లో పూజలు నేర్పిస్తారు. మూడో ఏడాది నుంచి అర్చవర, భాషా కర్మలు, మనిషి పుట్టిన నాటి నుంచి చనిపోయేవరకు జరిపే 16 కర్మల గురించి నేర్పిస్తారు. ఐదు, ఆరేళ్లలో దేవాలయాల్లో పూజలు, మహోత్సవాలు, కల్యాణాలు, అన్నిరకాల యజ్ఞయాగాల గురించి చెప్పి వాటిని చేయిస్తారు. ఇలా ఆరేళ్ల కోర్సు పూర్తి చేశాక పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఉత్తీర్ణత పత్రం  అందచేస్తారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పాఠశాలకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ నుండి కూడా విద్యార్థులు వస్తుంటారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top