ఫీజు పథకం ఎత్తివేతకు ప్రభుత్వం కుట్ర

ఫీజు పథకం ఎత్తివేతకు ప్రభుత్వం కుట్ర - Sakshi


తెలంగాణ బీజేపీ ఎల్పీనేత డాక్టర్ లక్ష్మణ్

 

హైదరాబాద్: స్థానికత పేరిట ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీజేపీ శాసన సభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు.  నాంపల్లిలోని బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు మనోహర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ప్రకాష్‌రెడ్డి, సుభాష్‌చందర్‌జీ, దాసరి మల్లేశంతో కలిసి ఆయన మాట్లాడారు. 1956కు ముందు నివాసమున్న వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ ను వర్తింపజేస్తామనడం తగదని, ఇలాంటి విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. అర్హులైన విద్యార్థులందరికీ ఆ పథకాన్ని వర్తింపజేయాలని, లేని పక్షంలో బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. 1956కు ముందు జహీరాబాద్, గద్వాల్, భద్రాచలం, ఆదిలాబాద్ ప్రాంతాలు తెలంగాణలో లేవని, మరి ఆయా ప్రాంతాల విద్యార్థుల సంగతేమిటని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న ప్రభుత్వం.. వాటికి అనుమతించిన అధికారులపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అక్రమ కట్టడాల కూల్చివేతలను చార్మినార్ నుంచి ఎందుకు ప్రారంభించడం లేద న్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల దృష్ట్యా ఎంఐఎంతో దోస్తీ కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇలాంటి చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లే వివాదాస్పదమైన నేపథ్యంలో 12 శాతం ఎలా అమలు చేస్తారన్నారు. ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తామని చెప్పి, ఇప్పుడు దళితులకు మాత్రమే ఇస్తామనడం ఎస్టీలను మోసగించడమేనని విమర్శించారు.



కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్న బీజేపీ ఏపీ శాఖ



 ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు విషయంలో 1956కు ముందటి స్థానికతనే ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోకుంటే ఎందాకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ హెచ్చరించింది. పార్టీ నాయకులు యడ్లపాటి రఘునాథ్‌బాబు, సుధీష్ రాంబొట్ల హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ సంక్షోభానికి కారణమయ్యేలా తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.      

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top