రైతు చేతిలో వ్యవసాయ సమాచారం  

Farmers Knowing To The Agriculture Information  In Mahabubnagar - Sakshi

సాక్షి, అలంపూర్‌: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. సమాచార వ్యవస్థ సామాన్యులకు మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే రైతుల ముంగిట్లోకి వ్యవసాయ వెబ్‌సైట్‌లు వచ్చాయి. వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంభిస్తూ పంటల్లో మంచి దిగుబడి సాధిస్తున్నారు. నూతన పద్ధతుల్లో రాణిస్తున్న రైతులకు మరింత మెరుగైన సమాచారం అందించడానికి ప్రభుత్వాలు అనేక అవకాశాలను కల్పిస్తున్నాయి. రైతులు వ్యవసాయంలో వస్తున్న మార్పులు, పంట సాగు, ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో జరిగే చర్చలు, వ్యవసాయ సూచనలు, సలహాలు ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.   

వ్యవసాయ వెబ్‌ సైట్‌  
వ్యవసాయానికి సంబందించిన సమాచారం పొందడానికి భారత ప్రభుత్వం www.farmer.gov.in అనే వెబ్‌ సైట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో లాగిన్‌ అయి మొబైల్‌ నంబర్‌ను రిజిస్టర్‌ చేసుకుంటే సమాచారం పొందే అవకాశం ఉంటుంది.    

www.vikar pedia.in ఈ వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయగానే మొదట పైన బాక్స్‌లో వివిధ భాషలతో కూడిన సమాచారం ఉంటుంది. అందులో తెలుగును ఎంచుకోగానే మొట్టమొదగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం అనే సమాచారం ఉంటుంది. రైతులకు కావాల్సిన సమచారాన్ని ఎంచుకోవాలి. వెంటనే అందుకు సంబందించిన పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది. వ్యవసాయ  సమచారాన్ని ఎంచుకోగానే పంట ఉత్పత్తి, వ్యవసాయ ఉత్తమ పద్ధతులు, బీమా పథకాలు,  వ్యవసాయ పంచాంగం, పశు సంపద, మత్స్య సంపద వంటి సమాచారం రైతులు పొందే అవకాశం ఉంటుంది.   

వెబ్‌ రిజిస్ట్రేషన్‌  
రైతులు ఇంటర్‌నెట్‌ ద్వారా సమాచారం పొందే అవకాశం ఉంటుంది. ఇంటర్‌నెట్‌లో లాగిన్‌ అయి తమ పేరు, రాష్ట్రం, జిల్లా, మండలం పేరును ఆసక్తి ఉన్న వ్యవసాయ శాఖల్లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాతనే వ్యవసాయ సలహాలు, సూచనలు, ఎస్‌ఎంఎస్‌ ద్వారా చేరుతాయి. www.afrirnettfnic.in వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయగానే వివిధ అంశాలు ఎడమవైపులో వస్తాయి. అందులో కావాల్సిన అంశాలను క్లిక్‌ చేస్తే మనకు కావాల్సిన సమగ్ర సమచారం అందుబాటులోకి వస్తోంది.   

టోల్‌ ఫ్రీ నంబర్‌  
రైతులు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800–180–1551 ద్వారా కిసాన్‌ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయవచ్చు. దేశంలో ఎక్కడైనా వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన సాంకేతిక సూచనలు, సలహాలు పొందవచ్చు. రైతులు కిసాన్‌ కాల్‌ సెంటర్‌కి ఫోన్‌ చేసి ఎస్‌ఎంఎస్‌ సేవలు పొందేందుకు సెల్‌ నంబర్‌ నమోదు చేసుకోవాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top