పేరు గొప్ప.. దిగుబడి జీరో..!

fake seed in adilabad Farmers - Sakshi

ఆదిలాబాద్‌/ ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా వ్యాప్తంగా నాసిరకం పత్తి విత్తనం రైతును నిండా ముంచుతోంది. గత మూడేళ్లుగా జిల్లా రైతులను చిత్తు చేస్తున్న నకిలీ విత్తనం ఈ ఏడాది ‘కింగ్‌ ’ రూపంలో వచ్చింది. ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 వేల ఎకరాల్లో కింగ్‌ విత్తనం సాగైనట్లు తెలుస్తోంది. పత్తి కర్ర ఏపుగా పెరిగిందే గానీ పూత.. కాయ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలలుగా ఎదురు చూసినా పత్తి పుంజ రాకుండా కర్ర మాత్రమే మిగిలింది. ఇప్పటికే నకిలీ విత్తనాలు, బీటీ–3, గులాబీ పురుగుతో పత్తి రైతులు పంట దిగుబడులు కోల్పోయిన విషయం తెలిసిందే. గత వారం రోజుల నుంచి కింగ్‌ విత్తనం వేసిన రైతులు ఆందోళన బాట పడుతున్నారు. నాసిరకం విత్తనాలతో మోసపోయామని గ్రహించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లా వ్యాప్తంగా కింగ్‌ విత్తనాలు విత్తిన రైతులు తమకు నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట పత్తి రైతులు ధర్నా చేపట్టారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేలు పరిహారం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. నాథ్‌ సీడ్స్‌ కంపెనీకి చెందిన కింగ్‌–101 విత్తనరకంతో మోసపోయిన జైనథ్‌ మండలం మేడిగూడ గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం ఆ కంపెనీ ప్రతినిధులను నిర్భంధించారు. బీజేపీ ఆధ్వర్యంలోనూ  కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పత్తి కర్రలకు నిప్పటించి నిరసన తెలిపారు.

15 వేల ఎకరాల్లో..
జిల్లాలో 15 వేల నుంచి 20 వేల వరకు నాథ్‌ సీడ్స్‌ కంపెనీకి చెందిన కింగ్‌–101 పత్తి ప్యాకెట్లను విక్రయించినట్లు సమాచారం. జైనథ్‌ మండలంలోని మేడిగూడ, జైనథ్, పార్టీ, ముక్తాపూర్, గిమ్మ, కౌట, బీంపూర్‌ మండలంలోని అర్లి–టి గ్రామాల్లో రైతులు ఈ సీడ్‌ను అధికంగా విత్తుకున్నారు. ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన ఓ డీలర్‌ బంధువు సీడ్‌ బాగుటుందని చెప్పడంతోనే అర్లి–టి గ్రామంలో అధిక మొత్తంలో విత్తనాలు విత్తుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా జైనథ్‌ మండలంలో దాదాపు 10 వేల ఎకరాల వరకు ఈ సీడ్‌ను వేసినట్లు తెలుస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ కంటే ముందుగానే రైతుల వద్ద బుకింగ్‌ చేసుకుని సగం డబ్బులు ముందుగానే తీసుకున్నట్లు పలువురు రైతులు చెబుతున్నారు. గురువారం వ్యవసాయ శాఖ అధికారులు కంపెనీకి చెందిన ప్రతినిధులతో సమావేశమైనట్లు తెలిసింది. శుక్రవారం కంపెనీకి చెందిన ప్రతినిధులు జైనథ్‌ మండలంలో పత్తి పంటను పరిశీలించేందుకు వెళ్లారు. వారిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కర్రలే మిగులుతున్నాయి..
విత్తనాలు విత్తుకునే సమయంలో విత్తన కంపెనీలు గ్రామాల్లో ఆర్భాటంగా ప్రచారాలు చేపట్టాయి. ప్రతి ఏడాది విత్తన కంపెనీలు రైతులను మోసం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోవడం గానీ, నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించడంలో ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో చివరకు రైతులకు నష్టమే మిగులుతోంది. ఈ ఏడాది కూడా ఖరీఫ్‌లో కింగ్‌ పత్తి విత్తనాలతో పంట దిగుబడి వస్తుందని మాయమాటలు చెప్పడంతో రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. ఈ కంపెనీకి చెందిన పత్తి మొక్కలు 7 ఫీట్ల కంటే ఏపుగా పెరిగాయి. చెట్టుకు కనీసం పది కాయలు కూడా కాయడం లేదు. పూత, కాత వస్తున్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో పింజగా మారకుండా రాలిపోతున్నాయి. ఇప్పటికే రైతులు రెండుసార్లు పత్తి ఏరగా, ఈ రకానికి చెందిన పత్తికి ఇంకా ఏరేందుకు పత్తి కూడా రాలేదు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ శాఖ అ«ధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమ గోస ఎవరి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు రోజుల క్రితం జైనథ్‌ మండలం మేడిగూడ గ్రామానికి కంపెనీ ప్రతినిధులు వచ్చి పంటను పరిశీలించారు. అయితే తమకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. తమ శాస్త్రవేత్తలతో వచ్చి పంటలను పరిశీలిస్తామని చెప్పి తప్పించుకున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top