‘త్రీడీ’ ఫేస్‌ షీల్డ్, మాస్క్‌లు

Face Shields And Masks With 3D Printing Technology Created By JNTU Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనాను ఎదుర్కోవడంలో ఉపయోగపడేలా త్రీడీ ప్రింటింగ్‌ పరిజ్ఞానంతో ఫేస్‌ షీల్డ్స్, మాస్కులను హైదరాబాద్‌ జేఎన్‌టీయూ రూపొందించింది. యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నానో టెక్నాలజీ విభాగం వీటిని తయారు చేసింది. మెడికల్‌ సిబ్బందికి, పోలీసులకు అత్యంత రక్షణగా ఉండేలా వీటిని రూపొందించారు. ఇప్పటివరకు ఆసుపత్రుల్లో వైద్యులు ఉపయోగిస్తున్న పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్స్‌ ముఖం మొత్తం కవర్‌ అయ్యేలా  లేవని, త్రీడీ ప్రింటింగ్‌ పరిజ్ఞానంతో పూర్తి రక్షణ కలిగేలా వీటిని రూపొందించామని చెబుతున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ టెక్విప్‌ ఆర్‌అండ్‌డీ సహకారంతో వీటిని తయారు చేశారు.

పూర్తి స్థాయిలో వైరస్‌ను అడ్డుకునేలా..
రోగి దగ్గినపుడు, తుమ్మినప్పుడు తుంపర్లు, వైరస్‌ గాలిలోకి వ్యాపించకుండా ఆపేందుకు ఆక్రిలిక్‌ షీట్‌తో ఈ షీల్డ్స్‌ను రూపొందించారు. పైగా ఇవి రీయూజబుల్‌. ఒకసారి ఉపయోగించిన షీట్‌ను సబ్బు లేదా కెమికల్‌తో క్లీన్‌ చేసుకొని మళ్లీ మళ్లీ వినియోగించుకోవచ్చు. మాస్క్‌లను కూడా మళ్లీ ఉపయోగించుకునేలా రూపొందించారు. మాస్క్‌లో ఉండే ఫిల్టర్‌ను మాత్రమే మార్చుకోవాల్సి ఉంటుంది. సాధారణ సర్జికల్‌ ఫైబర్‌ను మాస్క్‌లో ఫిల్టర్‌గా వినియోగించారు.

ఇప్పటికే వివిధ విభాగాలకు అందజేత
జేఎన్‌టీయూ నానో టెక్నాలజీ విభాగం రూపొందించిన ఈ షీల్డ్స్‌ను ఇప్పటికే పలు విభాగాలకు అందజేసినట్లు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ వెల్లడించారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌కు 500, ఉస్మానియా ఆసుపత్రికి 170, డీఆర్‌బీఆర్‌కేఆర్‌ఆర్‌ ఆయుర్వేద ఆసుపత్రికి 20, మరో 150 వరకు ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు అందజేసినట్లు వెల్లడించారు.

జింక్, కాపర్‌ అయాన్స్‌తో ఫిల్టర్స్‌ రూపకల్పన
మాస్క్‌లలో ఉండే ఫిల్టర్లు మరింత మెరుగైనవిగా, వైరస్‌లను నిర్మూలించేవిగా తయారు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. జింక్, కాపర్‌ అయాన్స్‌తో కూడిన ఫిల్టర్స్‌ తయారు చేసేందుకు ఏర్పాట్లు చేశాం. అవి వైరస్‌ వ్యాపించకుండా, శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి. త్వరలోనే వాటిని అందుబాటులోకి తెస్తాం. మా ల్యాబ్‌లో రోజుకు 20 షీల్డ్స్‌ను రూపొందిస్తున్నాం.
– డాక్టర్‌ శిల్పాచక్ర, జేఎన్‌టీయూ నానో టెక్నాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top