ప్రైవేటు వైద్యవిద్యలోనూ ఈడబ్ల్యూఎస్‌ 

EWS also in private medical education - Sakshi

10% కోటా అమలు చేయాల్సిందేనంటూ ఎంసీఐ ఉత్తర్వులు 

ప్రైవేటు కాలేజీలు 28లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశం 

ఆలిండియా కోటా కోసం 15% సీట్లు కేటాయించాలని షరతు

సాక్షి, హైదరాబాద్‌: అగ్రవర్ణ పేద (ఈడబ్ల్యూఎస్‌) విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌ సీట్లలో ఈడబ్ల్యూఎస్‌ కోటా ప్రకారం 10% రిజర్వేషన్లు అమలు చేయాలని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు బుధవారం లేఖ రాసింది. దీనికోసం ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తులను వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పంపించాలని ఆదేశించింది. అయితే నీట్‌ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని 15% సీట్లను ఆలిండియా కోటాలో కేంద్రం భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు కూడా తమ కన్వీనర్‌ కోటాలోని ఎంబీబీఎస్‌ సీట్లలో 15% ఆలిండియా కోటాకు ఇవ్వాలని, అప్పుడే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. ఇదిలావుండగా తెలంగాణలోని కొన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఈడబ్ల్యూఎస్‌ కోటా ప్రకారం 10% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించుకుని ఈ మేరకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గతంలోనే ఎంసీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అప్పట్లో దీనిపై ఎంసీఐ నిర్ణయం తీసుకోలేదు. దీంతో తాజాగా మరోసారి ఆయా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలతోపాటు ఇతర ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఈ కోటాలో పెరగనున్న 281 సీట్లు 
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 2019–20 విద్యాసంవత్సరానికి మొత్తంగా 4,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీతో కలిపి 10 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,500 ఎంబీబీఎస్‌ సీట్లు, 21 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 3,100 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అందులో 6 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద ఇటీవల ఎంసీఐ అదనంగా 190 ఎంబీబీఎస్‌ సీట్లను పెంచింది. ఇక 21 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 4 మైనారిటీ కాలేజీలకు, 2 కొత్త మెడికల్‌ కాలేజీలకు ఈ కోటా వర్తించదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. అంటే అవి పోగా 15 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 2,250 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అందులో సగం అంటే 1125 కన్వీనర్‌ కోటా సీట్లున్నాయి.

వాటిని ఆధారం చేసుకొని 25% సీట్లను ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద పెంచాల్సి ఉంటుంది. అంటే 281 ఎంబీబీఎస్‌ సీట్లు పెరిగే అవకాశముంది. అయితే వీటికోసం ఎన్ని కాలేజీలు దరఖాస్తు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్‌ కోటా సీట్లకు నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆ సీట్లకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 28వ తేదీన ముగుస్తుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు ఎలాగన్నదానిపై చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే 11 వేల మంది విద్యార్థులు కన్వీనర్‌ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికేట్లు ఉన్నవారు సహజంగానే ప్రైవేటులో వచ్చే ఈ కోటా సీట్లకు అర్హులేనని విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి స్పష్టంచేశారు. నోటిఫికేషన్లలోనూ ఆ మేరకు వెసులుబాటుందన్నారు. 

ముందుకొచ్చే కాలేజీలెన్ని? 
ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకోసం అసలు ఎన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ముందుకు వస్తాయన్నదే అసలైన ప్రశ్న. ఒకవైపు ఆలిండియా కోటాకు 15% సీట్లు ఇవ్వాలన్న షరతు, పైపెచ్చు కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌ సీట్లకు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో ఫీజు ఏడాదికి రూ.60వేలు మాత్రమే కావడంతో తమకేంలాభమన్న వాదన ప్రైవేటు యాజమాన్యాల్లో వినిపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక కాలేజీకి ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 25 సీట్లు పెరిగితే వచ్చే ఫీజు ఏడాదికి రూ.15 లక్షలు మాత్రమే. అందుకోసం సీట్లు పెంచుకుని లాభమేంటని వారంటున్నారు. అయితే అదనంగా సీట్లు పెరగడం వల్ల అదే స్థాయిలో పీజీ మెడికల్‌ సీట్లు కూడా పెరుగుతాయని, కాబట్టి అది ఆయా యాజమాన్యాలకు ప్రయోజనకరంగా ఉంటుం దని వైద్యాధికారులంటున్నారు. ఈ రెండు అంశాలను బేరీజు వేసుకొని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ముందుకు వెళ్లే అవకాశముందని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top