పన్ను వసూలు పడిపోయింది..

Etela says Telangana's growth rate declined due to GST - Sakshi

జీఎస్టీకి ముందు 21.9 శాతం వృద్ధి, ఇప్పుడు 14 శాతం 

కేంద్రంపై ఈటల అసంతృప్తి 

సాక్షి, హైదరాబాద్‌:  వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలు విషయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు. జీఎస్టీ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని, రాష్ట్రానికి కనీసం పదివేల కోట్ల రూపాయల పన్నులు సేకరించుకునే ఆస్కారం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలిండియా అసోసియేషన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఎక్సై జ్‌ గెజిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారుల 10వ జనరల్‌ బాడీ సమావేశాన్ని శనివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జీఎస్టీ కారణం గా ఆదాయం రూ.95 వేల కోట్ల నుంచి రూ.85 వేల కోట్ల కు పడిపోయిందన్నారు.

జీఎ స్టీ కంటే ముందు రాష్ట్రం లో పన్ను వసూలు వృద్ధి 21.9 శాతముంటే ఇప్పుడు 14 శాతానికి పడిపోయిందన్నారు. నోట్ల రద్దు కారణంగా జీతాలు  సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించే సంస్కరణలు శాశ్వత ప్రయోజనాల దృష్ట్యా ఉండాలని అభిప్రాయపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోతే ఆ మాత్రం పన్నులు కూడా తగ్గేవి కావని కేంద్రంలోని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘సిగరెట్‌కి, బీడీకి 28% శ్లాబు లో ఒకే పన్ను విధించారు. బీడీలకు సిగరెట్లకు ఒకటే ట్యాక్స్‌ వద్దని కోరినా కేంద్రం వినలేదు.

గ్రానైట్‌ విషయంలోనూ మనకు అన్యాయమే జరిగింది.’అని ఈటెల వ్యాఖ్యానించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 200 వస్తువులపై పన్ను తగ్గించారని, సామాన్య ప్రజల జీవితం ఛిద్రం చేసేలా నిర్ణయాలు ఉండకూడదని అన్నారు. జీఎస్టీ పరిహారం కింద మనకు కూడా రూ.450 కోట్ల వరకు రావాల్సి ఉండగా, రూ.250 కోట్లే ఇచ్చారన్నారు. సెంట్రల్‌ ఎక్సైజ్‌లో పదోన్నతుల విషయంపై కేంద్ర ఆర్థికమంత్రితో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ వంటి రంగాల్లో సమాన అభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top