‘ఏ సర్పంచ్‌కు రాని అదృష్టం మీకు వచ్చింది’ | Errabelli Dayakar Rao Speech In Warangal District | Sakshi
Sakshi News home page

‘ఏ సర్పంచ్‌కు రాని అదృష్టం మీకు వచ్చింది’

Sep 5 2019 12:47 PM | Updated on Sep 5 2019 12:48 PM

Errabelli Dayakar Rao Speech In Warangal District - Sakshi

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

సాక్షి, జనగామ: ‘గతంలో ఏ సర్పంచ్‌కు రాని అదృష్టం మీకు వచ్చింది.. అభివృద్ధి చేసే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది.. మన ఊరి కోసం సేవ చేద్దాం’ అని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6 నుంచి అమలు చేయనున్న 30 రోజుల గ్రామ పంచాతీ ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణపై జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్‌ హాలులో బుధవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలే తప్ప అభివృద్ధిలో కాదని, మనం చేసే మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలతో తరతరాలకు గుర్తుండి పోతామన్నారు.

దాతలను ప్రోత్సహించాలి..
సీఎం కేసీఆర్‌ గ్రామాలను అభివృద్ధి చేయడానికి 30 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, సర్పంచ్‌లు చాలెంజ్‌గా తీసుకోవాలని మంత్రి కోరారు. గ్రామ అభివృద్ధి కోసం విదేశాల్లో ఉండే ఎన్‌ఆర్‌ఐలు, దాతల సహకారం తీసుకోవాలని, ముందుకు వచ్చేవారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో పర్మనెంట్‌ నర్సరీ ఉండేలా చూడాలని, నర్సరీ, శ్మశాన వాటికల కోసం భూమి ఇచ్చే దాతలను గుర్తించాలని సూచించారు. పార్టీలకు అతీతంగా అందరిని కలుపుపోతూ గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని కోరారు.

ట్రాక్టర్లు.. మినీ ట్రాక్టర్లు అందిస్తున్నాం..
గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు.. మినీ ట్రాక్టర్లను అందిస్తున్నామని, మేజర్‌ జీపీలకు ట్రాక్టర్, చిన్న జీపీలకు మినీ ట్రాక్టర్లు ఇచ్చే బాధ్యతను తీసుకున్నామని మంత్రి చెప్పారు. చెత్తను తొలగించడానికి, మొక్కలకు నీళ్లు అందించడానికి ట్రాక్టర్లు ఉపయోకరంగా ఉంటాయని, గ్రామానికి ఇద్దరు చొప్పున సిబ్బందిని తీసుకోవాలన్నారు. అయితే వారికి డ్రైవింగ్‌తో పాటు ఇతర పనులు వచ్చి ఉండాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పెంచాలని, నాటిన మొక్కులు జీవించి ఉండేలా బాధ్యత తీసుకోవాలన్నారు. మొక్కల పెంపకంలో టార్గెట్లు పెట్టి ఇబ్బంది పెట్టబోమని స్పష్టం చేశారు.

గ్రామాల ఆదాయం పెంచుదాం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులపై ఆధారపడకుండా గ్రామాల ఆదాయాన్ని పెంచుదామని మంత్రి ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు రూ.725 కోట్లు విడుదల చేయించామని, ఏడాదికి రూ.4068కోట్లు వస్తున్నాయని చెప్పారు. 500 జనాభా ఉన్న గ్రామాలకు ఏడాదికి రూ.8లక్షల చొప్పున నిధులు వస్తున్నాయని, ఈజీఎస్‌ నిధులను జీపీల అభివృద్ధికి వినియోగించాలన్నారు.

ఉపాధి హామీ పనులు సర్పంచ్‌ల నేతృత్వంలోనే చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ తనపై పెద్ద బాధ్యత పెట్టారని, పట్టుదలతో 30 రోజుల గ్రామ ప్రత్యేక కార్యాచరణలో జనగామను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుదామని మంత్రి అన్నారు. కార్యక్రమాన్ని సక్సెస్‌ చేసిన గ్రామాలకు నిధుల్లో ప్రాధాన్యత ఉంటుందని, ప్రభుత్వం దత్తత తీసుకుంటుందని వివరించారు. చెక్‌ పవర్‌ విషయంలో సర్పంచ్‌లు నిరాశ పడాల్సిన అవసరం లేదని, నిధుల విడుదలకు ఉప సర్పంచ్‌లకు సహకరించక పోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కేసీఆర్‌ మహాత్ముడు..
మిషన్‌ భగీరథ పథకంతో కృష్ణా, గోదావరి నదుల నీటికి ఇంటింటికీ అందించిన మహాత్ముడు కేసీఆర్‌ అని మంత్రి దయాకర్‌రావు అన్నారు. మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తి చేసి సాగు నీరు అందించారని, దేవాదుల నీళ్లు తెచ్చారని పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు, చెరువుల్లో పూడికతీత, రైతుబంధు పథకం అమలు చేశారని, ఆయన తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు. 

సర్పంచ్‌ కావాలనే ఖాయిష్‌ ఉండే..
నాకు మొదటి నుంచి సర్పంచ్‌ కావాలనే ఖాయిష్‌ ఉండేదని మంత్రి అన్నారు. ‘మా నాయిన 25 ఏళ్ల పాటు సర్పంచ్‌గా ఉన్నాడు. నా వయసు 23 ఏళ్లప్పుడు సర్పంచ్‌గా పని చేస్తానని అడిగాను.. ఓకే అని నాతో నామినేషన్‌ వేయించాడు.. గ్రామస్తులు మాత్రం నేను నామినేషన్‌ వస్తే పోటీలో ఉంటామని చెప్పారు.. మా నాయన అయితే ఏకగ్రీవం అన్నారు.. దానితో పోటీ నుంచి తప్పుకున్నాని ఈ సందర్భంగా పాత రోజులను మంత్రి గుర్తు చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement