నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

Election Commision Rules And Reglations In Medak - Sakshi

సాక్షి, మెదక్‌ రూరల్‌: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఎన్నికల ప్రక్రియపై బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు సినిమా హాళ్లు, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ తదితర సామాజిక మాద్యమాల ద్వారా చేసే ప్రచార ప్రకటనలకు తప్పకుండా మీడియా సర్టిఫికెట్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ అనుమతి తీసుకోవాలన్నారు. పబ్లిక్‌ ప్రాపర్టీస్‌పై జెండాలు కట్టడం, కూల్చేయడం వంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. అభ్యర్థులు నిబంధనలకు లోబడి ప్రచారం చేసుకోవాలన్నారు.

ఇప్పటికే ఈవీఎంల నిర్వహణ, పనితీరుపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం పూర్తయ్యిందన్నారు. ప్రతి ఓటరు ఓటరు స్లిప్‌తో పాటు ఏదేని గుర్తింపు కలిగిన ఐడీ కార్డును వెంట తెచ్చుకోవాలన్నారు. ఐడీ కార్డు ఉంటేనే ఓటువేసేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. లోక్‌సభ పరిధిలోని 50 గ్రామ పంచాయతీల్లో కొత్త వీల్‌చైర్స్‌ తెప్పిస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్‌లలో నర్సాపూర్‌ కేంద్రంగా కౌంటింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కాని,  ఎన్నికలు నిర్వహించే కేంద్రంలోకానీ ఓటు వేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. బస్సుడ్రైవర్లు, క్లీనర్లు, వీడియోగ్రాఫర్లు ఎన్నికల విధుల్లో ఉండి ఓటేసే పరిస్థితి లేని వారు ఈడీసీ సర్టిఫికెట్‌ ఇచ్చి ఎన్నికల్లో పాల్గొనేలా చూస్తున్నట్లు తెలిపారు. 

దివ్యాంగులు, అంధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. 
నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారి కోసం ప్రత్యేకంగా రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందని, అంధుల కోసం బ్రెయిలీ బ్యాలెట్‌ పేపర్‌ను ప్రతి పోలింగ్‌బూత్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల వారు వేతనాన్ని చెల్లిస్తూ సెలవు దినంగా ప్రకటించాల్సి ఉంటుందన్నారు. మెదక్‌ లోక్‌సభ పరిధిలో ఇప్పటివరకు మొత్తం రూ.51.40 లక్షల నగదు, 706 లీటర్ల లిక్కర్‌ను సీజ్‌ చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. 852 బైండోవర్‌ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ముగింపు నుంచి 48 గంటల వరకు మద్యం దుకాణాలను బంద్‌ చేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల ఖర్చు విషయంలో పోటీలో ఉన్న మొత్తం పదిమంది అభ్యర్థుల్లో బంగారు కృష్ణ, హనుమత్‌రెడ్డి, నర్సింలుగౌడ్, భరతేష్‌ వివరాలను తెలియజేయకపోవడంతో వారికి నోటీసులు  పంపించడం జరిగిందన్నారు.

ఖర్చుల వివరాలను చూపించకపోతే ఐపీసీ 171ఐ ఉల్లంఘన ప్రకారం క్రిమినల్‌ కేసులను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. సీవిజిల్‌తో ఓటర్లు ఫిర్యాదు చేయొచ్చన్నారు. మెదక్‌ పట్టణంలోని డీఎఫ్‌ఓ కార్యాలయంలో మహిళల కోసం ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాన్ని, దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్‌ స్టేషన్లను, నియోజకవర్గంలో ఒక మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 23వేల ఎపిక్‌కార్డులు వచ్చాయని, 60 శాతం పంపిణీ జరిగిందని, మిగితావి రెండు రోజుల్లో పూర్తవుతుందన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ జ్యోతిపద్మ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top