ఔను...  వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు 

Election Candidates Friendship Warangal - Sakshi

సాక్షి, మధిర: గతంలో ఉప్పు, నిప్పుగా ఉండే ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు నేడు ఒకే పార్టీలో ఉన్నారు. ఎర్రుపాలెం మండలానికి చెందిన భద్రాచలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్‌ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మధిర వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చావా రామకృష్ణ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. గతంలో అయిలూరి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడుకానీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పుడుకానీ ప్రత్యర్థి వర్గంగా టీడీపీకి చెందిన చావా రామకృష్ణ ఉన్నారు. ఆ మండలం లో ఈ రెండు వర్గాల మధ్య గ్రూపు తగాదా లు, పార్టీల విభేదాలు ఉండేవి. ప్రతీ గ్రామంలో వారిరువురికీ అనుచరులు ఉన్నారు.

ఈ క్రమంలో మంత్రి తుమ్మల వర్గీయునిగా కొనసాగుతున్న చావా రామకృష్ణ, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరునిగా ఉన్న అయిలూరి వెంకటేశ్వరరెడ్డి వేర్వేరు సందర్భాల్లో టీఆర్‌ఎస్‌ చేరారు. ఈ క్రమంలో మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి చొరవతో ఆ ఇద్దరు నాయకులు ఎర్రుపాలెం మం డలంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. గతంలో ప్రత్యర్థివర్గాలుగా ఉన్న ఈ ఇద్దరు నాయకులు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉండి కమల్‌రాజ్‌ గెలుపుకోసం ఒకే వాహనంలో తిరుగుతూ ప్రచారం చేయడం గమనార్హం. మధిర నియోజకవర్గంలో ఎర్రుపాలెం మండలానికి ప్రత్యేకత ఉంది.

ఆ మండలంలో ఏ అభ్యర్థికి మెజార్టీ వస్తుందో ఆ అభ్యర్థే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో గెలిచిన సం దర్భాలు ఉన్నాయి. దీంతో అయిలూరి వెంకటేశ్వ రరెడ్డి, చావా రామకృష్ణ కమల్‌రాజ్‌ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. ఇప్పటికే చావా రామకృష్ణకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి అప్పగించగా రాబోయే ప్రభుత్వంలో అయిలూరికి సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి హామీ ఇచ్చినట్లు సమాచారం. బుధవారం మధిరలో కమల్‌రాజ్‌ నామినేషన్‌ వేస్తున్న సందర్భంగా వారిద్దరూ కోర్టు ఆవరణలో ఉన్న వేపచెట్టుకింద కూర్చొని రాజకీయ పరిస్థితుల గురించి చర్చించు కోవడం గమనార్హం వారిద్దరి కలయికను ఆప్రాంతంలో ఉన్న వారు ఆసక్తిగా తిలకించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top