ఎగ్‌ @ రూ.4.25

Eggs Price Down Fall in Karthikamasam Effect - Sakshi

కార్తీకమాసం ప్రభావంతో తగ్గిన గుడ్ల ధర   

ఫామ్‌ రేట్‌ రూ.3.65, హోల్‌సేల్‌లో రూ.4.10

సాక్షి సిటీబ్యూరో: వాస్తవానికి గుడ్ల ధర చలికాలంలో పెరిగి, వేసవిలో తగ్గుతుంటుంది. అయితే ఈసారి చలికాలం ప్రారంభంలో ధరలు కాస్త పెరిగినా... వారం రోజుల నుంచి పడిపోయాయి. ప్రస్తుతం ఒక గుడ్డు ధర రిటైల్‌ మార్కెట్‌లో రూ.4.25 ఉండగా... గతేడాది నవంబర్‌లో రూ.5 దాటిందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓవైపు కార్తీకమాసం, మరోవైపు గుడ్ల ఉత్పత్తి పెరగడం ధరలు తగ్గడానికి కారణమని హోల్‌సేల్‌ వ్యాపారులుచెబుతున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఫామ్‌లో గుడ్డ ధర రూ.3.65 ఉండగా... హోల్‌సేల్‌లో రూ.4.10, రిటైల్‌లో రూ.4.25 పలుకుతోంది. గతేడాది ఈ సమయంలో ఫామ్‌ రేట్‌నే రూ.4.60 వరకు ఉందంటున్నారు. 

తగ్గిన ఎగుమతులు..  
తెలంగాణ నుంచి గుడ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో లేయర్‌ ఫామ్స్‌ పెరగడంతో ఈ ఏడాది ఎగుమతులు తగ్గాయి. మరోవైపు చలికాలంలో ధర ఉంటుందని ఫామ్‌ యజమానులు ఎక్కువగా లేయర్స్‌ను వేశారు. స్థానికంగా ఉత్పత్తి పెరిగింది. దీంతో ధరలు చాలా వరకు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫామ్‌ యజమానులు ఆందోళన చెందుతున్నా రు. ఒక్కో లేయర్‌ కోడిపై దాదాపు రూ.250 ఖర్చవుతుందని, ఈ నేపథ్యంలో ఒక్కో దానిపై రూ.75 వరకు నష్టం రావొచ్చని అంటున్నారు. ‘ప్రతిఏటా నవంబర్‌ నుంచి గుడ్ల ధరలు పెరుగుతాయి. ఈ ఏడాది చలికాలంలో ప్రారంభంలో పెరిగినా... నవంబర్‌ మూడో వారం నుంచి ధరలు విపరీతంగా తగ్గాయి. కార్తీకమాసంలో ప్రతిఏటా ధరలు తగ్గుతాయి. కానీ ఈ స్థాయిలో తగ్గుతాయని అనుకోలేద’ని నెక్‌ బిజినెస్‌ మేనేజర్‌ సంజీవ్‌ చింతావర్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top