జిల్లాకు..‘ముందస్తు’ ఫీవర్‌!

Early Elections In Telangana Assembly Nalgonda Politics - Sakshi

ప్రభుత్వం రద్దు దాదాపు ఖరారయినట్లేనన్న వార్తలు జిల్లాలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళతారని, గురువారం ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పత్రికల్లో, మీడియాలో బుధవారం వచ్చిన వార్తలతో రాజకీయ పార్టీలూ అప్రమత్తమవుతున్నాయి. ఆయా పార్టీల శ్రేణుల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొందరు గురువారం నియోజకవర్గాన్ని చుట్టారు. విరివిగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో రోజంతా
 బిజీగా గడిపారు. 

సాక్షిప్రతినిధి, నల్లగొండ :   కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికలపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆదివారం టీఆర్‌ఎస్‌ కొంగరకలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ ఒక విధంగా ఆ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించడమేనని భావించిన ఆయా పార్టీల నాయకులు నియోజకవర్గాల్లో తమ పరిస్థితి ఏమిటన్న అంశంపై బేరీజులు వేయడం మొదలు పెట్టారు. ఇక, బుధవారం నాటి వార్తలతో ఒక్కసారిగా అప్రమత్తమైన నాయకులు తమ అనుచరులను పిలిపించుకుని పరిస్థితిని అంచనా వేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వ రద్దుకు ముహూర్తం కూడా ఖరారైందన్న ప్రచారంతో జిల్లాను ముందస్తు ఫీవర్‌ పట్టి ఊపుతోంది.

ఎమ్మెల్యేలు బిజీబిజీ
ముందస్తు సంకేతాలు ముందే అందుకున్నట్లు అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బుధవారం తమ తమ నియోజకవర్గాల్లో బిజీబిజీగా గడిపారు. ఇప్పటికే పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు, కచ్చితంగా మొదలు పెట్టాల్సిన పనులకు శంకుస్థాపనలు చేసుకునే పనిలో పడ్డారు. అధినాయకత్వం సూచన మేరకు వారు ఈ పనుల్లో మునిగిపోయారు. కట్టంగూర్‌లో పీఏసీఎస్‌ భవనం, ముత్యాలమ్మగూడెంలో జీపీ భవనాన్ని ఎమ్మెల్యే వీరేశం ప్రారంభించా రు.  నకిరేకల్‌లో క్యాంప్‌ కార్యాలయాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డితో ప్రారంభించుకున్నారు. నకిరేకల్‌ మండ లం పాలెం గ్రామపం చాయతీ శివారులోని అర్దవారిగూడెంలో రూ.34లక్షల తో బ్రిడ్జి నిర్మాణం, నోముల, వల్లభాపురం గ్రామాల లో రూ.7 లక్షల చొప్పున ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ భవన నిర్మాణానికి శంకుసా ్థపన చేశా రు. చిట్యాల, కట్టంగూర్, కేతేపల్లిలో భారీగా కల్యాణలక్ష్మి, ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.

దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ పీఏపల్లిలో రూ.25లక్షలతో, భీమనపల్లిలో రూ.7.5లక్షలతో నిర్మించనున్న షెడ్యూల్‌ కులాల కమ్యూనిటీ భవనం, భీమనపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, గుడిపల్లి ప్రాథమిక, అజ్మాపురం ఉన్నత పాఠశాలలకు రూ.7.5 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణపనులకు శంకస్థాపన చేశారు. అలాగే చిల్కమర్రి, అజ్మాపురం, చిల్కమర్రి స్టేజీలలో రూ.8లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాలను, రూ.10లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ కార్యాలయాలను ప్రారంభించారు. ఒక్కసారి ప్రభుత్వం రద్దయితే ఎమ్మెల్యేలంతా మాజీలు కావడం ఖాయమని, ఆ తర్వాత అధికార కార్యక్రమాలు ఏమీ చేపట్టలేమన్న భావనతోనే ఈ కార్యక్రమాలు పెట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాజకీయ సమీకరణలతో కుస్తీ
ఒకవేళ నిజంగానే ప్రభుత్వ రద్దయి, ముందస్తు ఖరారైతే డిసెంబరు వరకు ఎన్నికలు పూర్తవుతాయన్న అంచనాతో ఉన్న ఆయా పార్టీల నాయకులు సమీకరణలు మొదలు పెట్టారు. గత ఎన్నికల్లో తమ నియోజవకర్గంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? తమ పరిస్థితి ఏమిటీ? నాలుగేళ్ల కిందినాటి పరిస్థితులే ఇపుడూ ఉన్నాయా? తమకు కలిసొచ్చే అంశాలు ఏమిటి? ఎక్కడ ఇంకా సరిదిద్దుకోవాల్సి ఉంది? ఒక్కో పార్టీలో టికెట్‌ రేసులో ఎవరెవరకు ఉన్నారు? బెర్తు ఎవరికి ఖరారయ్యే అవకాశం ఉంది.. వంటి అంశాలను ముందేసుకుని కుస్తీ పట్లు పడుతున్నారు. అధికార పార్టీ అన్ని సీట్లు తమవేనని పదే పదే ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ సమీకరణలు జోరందుకున్నాయి. మె జారిటీ నియోజకవర్గాల్లో ద్విముఖ, బహుముఖ పోటీలు జరిగే అవకాశం ఉండడంతో నేతలు తమ బుర్రకు పదును పెడుతూ కుల, వర్గాల వారీగా ఓట్లను విశ్లేషించే పనిలో పడ్డారు.

పార్టీ మార్పిళ్లపైనా చర్చ
వాస్తవానికి ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం అధికార టీఆర్‌ఎస్‌లో సిట్టింగులు అందరికీ టికెట్లు ఖాయమన్న భరోసాతో ఉన్నారు. కొందరు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు తమకు టచ్‌లో ఉన్నారని టీఆర్‌ఎస్‌ నాయకత్వం చెబుతుండడంతో.. వారు నిజంగానే పార్టీ మారితే కచ్చితంగా మారిపోయే అంశాలపైనా చర్చ మొదలైంది. మరోవైపు కాంగ్రెస్‌ కూడా ముందస్తుకు సిద్ధమవుతున్న తీరు జిల్లాలో రాజకీయ వేడిని పెంచింది. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం తన నివాసంలో ముఖ్య కార్యకర్తల స మావేశం నిర్వహించి ఎన్నికలకు సిద్ధం కావాల్సిందేనని పురమాయించారు. ఇక, టీఆర్‌ఎస్‌లో ఒకరికంటే ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్న స్థానాలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల ఆయా నేతలు ఎవరి అవకాశాలపై వారు ధీమాతో ఉండడమే కాకుండా, ఏ రకంగా తమకు టికెట్‌ వస్తుందో, ఎలా గెలుస్తామో లెక్కలు చెబుతున్నారు. మొత్తంగా ప్రభుత్వం రద్దు చేసుకుని ముందస్తు వైపు టీఆర్‌ఎస్‌ వేగంగా అడుగులు వేస్తోందన్న వార్తలు రేపే ఎమవుతుందోనన్న ఉత్కంఠను రేపుతున్నాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top