హెచ్‌సీయూలో రిక్షాల లొల్లి | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూలో ఈ–రిక్షాలు

Published Fri, Dec 27 2019 8:51 PM

E-Rickshaw Make Debut on Hyderabad Central University Campus - Sakshi

గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ క్యాంపస్‌లో మొదటిసారిగా ఈ రిక్షాల రవాణా ప్రారంభమైంది. విద్యార్థులు నిర్ణీత చార్జీలు చెల్లించి క్యాంపస్‌లో రాకపోకలు సాగించాలి. ఇప్పటి వరకు క్యాంపస్‌లో ఉచిత బస్సు సౌకర్యం ఉంది. బస్సు సౌకర్యాన్ని కొనసాగిస్తూనే ఈ రిక్షాలను ప్రైవేశపెట్టారు.

సాక్షి, రాయదుర్గం: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ క్యాంపస్‌లో ప్రస్తుతం విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది కలిపితే 6 వేలకుపైగా ఉంటారు. రవాణా సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు ప్రైవేటు సంస్థకు అనుమతించారు. ఈ–రిక్షాలను బెంగుళూరుకు చెందిన మెజర్స్‌ ట్రాన్స్‌వాహన్‌ టెక్నాలజీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ‘ఓన్, ఆపరేట్‌ అండ్‌ మెయింటెన్‌’ పద్ధతిన నిర్వహిస్తారు. అయితే రవాణాను ప్రైవేట్‌పరం చేసి విద్యార్థులపై భారం మోపడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.

ఏఏ మార్గాల్లో...
ఈ రిక్షాలు హెచ్‌సీయూ క్యాంపస్‌లో రెండు ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయి. మెయిన్‌గేటు నుంచి సౌత్‌ గేటు వరకు, సౌత్‌ క్యాంపస్‌ గేటు నుంచి మసీదుబండగేటు (స్మాల్‌ గేట్‌) వరకు ఉంటాయి. అక్కడి నుంచి తిరిగి అదేమార్గాల్లో అందుబాటులో ఉంటాయి.

వేళలు...
సోమవారం నుంచి శనివారం వరకు తిరుగుతాయి. ఆయా రోజుల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అందుబాటులో ఉంటాయి.
 
డిజిటల్‌ మోడ్‌లోనే చెల్లించాలి...
ఈ రిక్షాలకు డబ్బుల చెల్లింపులన్నీ డిజిటల్‌ మోడ్‌లోనే ఉంటాయి. ఒక ట్రిప్పునకు రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది. వీటిని విద్యార్థులు, ఫ్యాకల్టీ, స్టాఫ్, సందర్శకులు కూడా వినియోగించుకొనే అవకాశం కల్పించారు.
 
దివ్యాంగులకు ఉచితం
ఈ రిక్షాలలో దివ్యాంగ విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. వారు యూనివర్శిటీ గుర్తింపు కార్డును చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.

ఈ రిక్షాలను తిరగనివ్వం
క్యాంపస్‌లో విద్యార్థులకు ఈ–రిక్షాలలో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అనుమతించాలి. ఇతరులకు చార్జీలు వసూలు చేసినా అభ్యంతరం లేదు. విద్యార్థులపై భారం వేసే ఎలాంటి చర్యలనూ అంగీకరించం. ఇప్పటికే రిజిష్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్‌కు వినతిపత్రాలను సమర్పించాం. త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. లేదంటే ఈ–రిక్షాలను వర్సిటీలో తిరగనివ్వం.
– ఎం.శ్రీచరణ్, హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు

విద్యార్థులపై భారం తగదు
క్యాంపస్‌లో బస్సుల ట్రిప్పుల సంఖ్య పెంచాలని డిమాండ్‌ చేస్తుంటే ఆర్థిక భారం మోపేలా ఈ రిక్షాలను ప్రైవేశపెట్టారు. స్కాలర్‌షిప్‌ రూ. 750 మాత్రమే ఇస్తూ ఇలాంటి భారం మోపడం తగదు. ఒక్కో విద్యార్థి కనీసం నాలుగు సార్లు హాస్టల్‌ నుంచి బయట తిరిగితే రోజుకు రూ. 50 మేర రవాణా చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇక మెస్, ఇతర ఖర్చులను ఎలా భరిస్తారు? ఈ చర్యను వెంటనే ఉపసంహరించాలి. లేదంటే గత్యంతరం లేక ఉద్యమించాల్సి ఉంటుంది.
– పి సందీప్, డీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి, హెచ్‌సీయూ 

Advertisement
 
Advertisement
 
Advertisement