‘షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఆ ప్రమాదం జరిగింది’

Due To Short Cicuit Maasive Fire Accident At Collierville Three Nalgonda Persons Died - Sakshi

సాక్షి, నల్గొండ : అమెరికాలోని కొలిర్‌విల్‌ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నల్గొండ వాసులైన సాత్విక్ నాయక్‌, సుహాస్ నాయక్‌, జయసుచిత్‌ మరణించిన సంగతి తెలిసిందే. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు శ్రీనివాస్‌ నాయక్‌, సుజాత హుటాహుటిన అమెరికా బయలుదేరి వెళ్లారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన బిడ్డలు.. ఇలా విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రుల గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారి స్వగ్రామం గుర్రపు తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

దేవరకొండ నియోజకవర్గంలోని నేరుడుగొమ్ము మండలం గుర్రపు తండా గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ నాయక్‌, సుజాతలు గ్రామంలో ‘అలితేయా’ క్రిస్టియన్‌ మిషనరీ ఆశ్రమంతో పాటు స్కూల్‌ను కూడా నడుపుతున్నారు. అంతేకాక శ్రీనివాస్‌ నాయక్‌ చర్చి పాస్టర్‌గా కూడా పని చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌ నాయక్‌కు అమెరికాకు చెందిన మరో పాస్టర్‌తో పరిచయం ఏర్పడింది. అతని సాయంతో శ్రీనివాస్‌ నాయక్‌ తన ముగ్గురు పిల్లలైన సాత్విక్‌, జాయి, సుహాస్‌లను అమెరికాకు పంపి చదివిస్తున్నారు. వీరు అమెరికా వెళ్లి ఇప్పటికి 20 నెలలు అయ్యింది.

ఈ క్రమంలో క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ఈ నెల 24 రాత్రి స్థానిక చర్చి పెద్ద డేనీ విల్లాలో జరిగిన వేడుకల్లో సాత్విక్ నాయక్‌, సుహాస్ నాయక్‌, జయసుచిత్‌ పాల్గొన్నారు. డేనీ కుటుంబసభ్యులతో కలిసి  క్రిస్మస్‌ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో విల్లాలో షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. అగ్నికీలలు ఇంటిని చుట్టుముట్టాయి. భారీస్థాయిలో జరిగిన ఈ ప్రమాదంలో సాత్విక్, సుహాస్‌, జయ సుచిత్‌తోపాటు డేనీ భార్య మంటల్లో సజీవ దహనమయ్యారు. డేనీ, అతని కొడుకు మాత్రం అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన గిరిజన బిడ్డలు ఇలా చనిపోవడం గ్రామంలోని ప్రతి ఒక్కరిని కంట తడిపెట్టిస్తోంది.

బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : ఉత్తమ్‌
గిరిజన విద్యార్థుల మృతి పట్ల టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్‌ ఉన్న విద్యార్థులు ఇలా మృత్యువాత పడటం అత్యంత దురదృష్టకరమన్నారు. పిల్లల తల్లిదండ్రులు శ్రీనివాస్‌ నాయక్‌, సుజాతలకు సానుభూతి తెలిపారు. బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా సాయం చేయాలంటూ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top