గీతన్నకు మొగిపురుగు దెబ్బ | The drying of the palm trees | Sakshi
Sakshi News home page

గీతన్నకు మొగిపురుగు దెబ్బ

Apr 3 2018 2:22 AM | Updated on Apr 3 2018 2:22 AM

The drying of the palm trees - Sakshi

సిద్దిపేట జిల్లాలో మొగిపురుగు బారిన పడి చనిపోయిన తాటిచెట్లు

సాక్షి, సిద్దిపేట: రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, భారీ విద్యుత్‌లైన్లు వేయడం, బీడు భూములను వ్యవసాయానికి వాడుకోవడం వంటి కారణాలతో ఇప్పటికే తాటి వనాలు కనుమరుగు అవుతుండగా.. తాజాగా గీత కార్మికులకు మొగిపురుగు రూపంలో మరో దెబ్బ తగులుతోంది. కుండల కొద్దీ కల్లు వచ్చే తాటి చెట్లు చూస్తుండగానే మొగి విరిగిపోవడం, నిలువునా ఎండిపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని గీత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మొగిపురుగు తొలిచేయడం వల్ల చెట్లు చనిపోతున్నాయని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి నివారణ మార్గం లేదని వారు చేతులెత్తేస్తున్నారు.  

3 వేలకు పైగా చనిపోయిన తాటిచెట్లు 
రాష్ట్ర వ్యాప్తంగా మొగిపురుగు సోకి ఇప్పటికే మూడు వేలకు పైగా తాటిచెట్లు చనిపోయినట్లు గీత కార్మిక సంఘం చేసిన సర్వేలో తేలింది. ప్రధానంగా గీత వృత్తిపైనే ఆధారపడి జీవించేవారు అధికంగా ఉన్న నల్లగొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లో ఈ మొగిపురుగు బెడద తీవ్రంగా ఉంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలోని నంగునూరు, మద్దూరు, హుస్నాబాద్, కరీనంగర్‌ జిల్లాలోని చిరుగు మామిడి, జగిత్యాల, జనగామ జిల్లాల్లోని వడ్లకొండ, నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్‌లో అధికసంఖ్యలో తాటి చెట్లు మొగిపురుగు బారిన పడి చనిపోతున్నాయి. ఈ మొగిపురుగు చెట్టు మొగిలో చేరి రసాన్ని పీల్చుతూ.. కిందికి తొలుచుకుంటూ పోతుంది. చెట్టు చనిపోగానే మరో చెట్టుపైకి చేరుతుంది. పురుగును నిర్మూలించకపోతే తాటివనాలు కనుమరుగవుతా యని గీత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధి కోల్పోతున్నాం 
సిద్దిపేట మండలంలోని పలు గ్రామాల్లో తాటి చెట్లు ఎండిపోవడంతో గౌడ కులస్తులు ఉపాధి కోల్పోతున్నారు. మొగిపురుగు తినేయడంతో తాటి చెట్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. మొగిపురుగు బారి నుంచి చెట్లును కాపాడి గౌడ కులస్థులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– పల్లె మధుసూదన్‌గౌడ్, మద్దూరు

గీత వృత్తిని కాపాడాలి 
ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తాటి, ఈత చెట్లను కొట్టేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు మొగిపురుగు కూడా కార్మికుల పాలిట శాపంగా మారింది. ఏపుగా పెరిగి కుండల కొద్దీ కల్లు ఇచ్చే చెట్లను మొగి పురుగు తొలిచేస్తోంది. అధికారులు తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలి.  
– ఎంవీ రమణ, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement