డ్రైవరే సూత్రధారి | Driver Conductor | Sakshi
Sakshi News home page

డ్రైవరే సూత్రధారి

Apr 27 2014 12:40 AM | Updated on Sep 2 2017 6:33 AM

డ్రైవరే సూత్రధారి

డ్రైవరే సూత్రధారి

ఎల్లారెడ్డిగూడ వద్ద నకిలీ పోలీసులు ఈనెల 21వ తేదీ రాత్రి ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన రూ.10.90 లక్షలు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు.

  • మరో ముగ్గురితో కలిసి రూ. 10.90 లక్షల దోపిడీ
  •   పోలీసుల ముసుగులో ఎత్తుకెళ్లిన నిందితులు
  •   ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు
  •  మెహిదీపట్నం, న్యూస్‌లైన్:  ఎల్లారెడ్డిగూడ వద్ద నకిలీ పోలీసులు ఈనెల 21వ తేదీ రాత్రి ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన రూ.10.90 లక్షలు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ఆ సంస్థ కారు డ్రైవరే ఈ దోపిడీకి సూత్రధారిగా తేల్చారు. ఇతడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  శనివారం వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం...

    యూసుఫ్‌గూడ శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఇస్తియాక్ అలీ (26)  టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ రిత్విక్ కన్‌స్రక్షన్స్‌లో కొన్ని రోజులుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.   మహబూబ్‌నగర్ సింగాటం గ్రామానికి కారు డ్రైవర్ పుట్ట రాము (25), అదే గ్రామానికి చెందిన హోంగార్డు ఎం.నాగరాజు(34), జియాఉద్దీన్ ఇతనికి స్నేహితులు.

    ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అరికట్టేందుకు పోలీసులు చేస్తున్న సోదాలను ఆసరా చేసుకొని భారీగా డబ్బు తరలించేవారిని దోచుకోవాలని  ఇస్తియాక్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి పథకం వేశాడు. ఇందులో భాగంగా మొదట తాను పని చేస్తున్న సంస్థనే టార్గెట్ చేశాడు.  రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా రిత్విక్ సంస్థ వారు ఈనెల 21వ తేదీ రాత్రి బషీర్‌బాగ్‌లోని ఆమ్‌వే కన్‌స్ట్రక్షన్స్ నుంచి రూ.25 లక్షలు తీసుకొని కారులో బంజారాహిల్స్ బయలుదేరారు.   

    ఇదే అదనుగా భావించిన డ్రైవర్ మహ్మద్ ఇస్తియాక్ డబ్బు తరలిస్తున్న విషయాన్ని తమ ముఠాకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు ఎల్లారెడ్డిగూడ వద్ద మాటు వేశారు. డబ్బు తరలిస్తున్న కారు రాగానే రాము, నాగరాజు, జియా ఉద్దీన్ ఆపారు. తాము టాస్క్‌ఫోర్స్  పోలీసులమని, వాహన తనిఖీలు చేస్తున్నామని కారులో ఎక్కారు.  సంస్థ మేనేజర్ ఏసుబాబును బెదిరించి వెనుకాల ఉన్న డబ్బు బ్యాగులోంచి రూ.10 లక్షల 90 వేలు తీసుకొని వెళ్లిపోయారు.

    ఈ ఘటనపై రిత్విక్ సంస్థ యాజమాన్యం మరునాడే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ దోపిడీకి సూత్రధారుడైన మహ్మద్ ఇస్తియాక్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. కాగా, అతడి తీరుపై పోలీసులకు అనుమానం వచ్చి.. అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు.

    అతను ఇచ్చిన సమాచారంతో నిందితులు పుట్టా రాము, నాగరాజులను శనివారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 7.95 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.  మరో నిందితుడు జియా ఉద్దీన్ పరారీలో ఉన్నాడు. నిందితుల్లో ఒకడైన నాగరాజు మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు ఠాణాలో హోంగార్డ్‌గా పని చేస్తున్నాడని, అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని డీసీపీ తెలిపారు. దోపిడీ చేసే స్థలంలో కేవలం నిలబడితేనే రూ.40 వేలు ఇస్తామనడంతో అతను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

    కాగా, ఇస్తియాక్‌పై గతంలో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు కార్ల దొంగతనాలు ఉన్నాయన్నారు. అలాగే జియాఉద్దీన్‌పై కూడా మహబూబ్‌నగర్, వనపర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో చీటింగ్ కేసు, రాముపై కూడా మహబూబ్‌నగర్, నల్లగొండజిల్లాల్లో పలు పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్, చోరీ వంటి నేరాలున్నాయన్నారు. నిందితులు ముగ్గురినీ రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో అడిషినల్ డీసీపీ నాగరాజు, పంజగుట్ట ఏసీపీ రవివర్మ, డీఐ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement