20 మంది గాళ్‌ఫ్రెండ్స్‌, ఇద్ద‌రు భార్య‌లు.. | Fake Cop From Muzaffarnagar Duped Women In 4 States | Sakshi
Sakshi News home page

20 మంది గాళ్‌ఫ్రెండ్స్‌, ఇద్ద‌రు భార్య‌లు..

Jul 4 2025 5:57 PM | Updated on Jul 4 2025 6:13 PM

Fake Cop From Muzaffarnagar Duped Women In 4 States

ఇలా ఎలారా.. అని అవాక్క‌య్యారా? ఒక్క‌రితోనే వేగ‌లేక చ‌స్తున్నాం, ఇంత మందిని ఎలా మేనేజ్ చేశావ్ బ్రో అంటూ బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకోకండి. పాపం ఎప్ప‌టికైనా పండుతుంది. త‌ప్పు చేసిన వాడు ఎప్ప‌టికీ త‌ప్పించుకోలేడు. నౌషాద్ త్యాగి విష‌యంలోనూ అదే జ‌రిగింది. మ‌హిళ‌ల జీవితాల‌తో చెల‌గాట‌మాడిన ఈ కేటుగాడు ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు చిక్కాడు.

ఎవ‌రీ నౌష‌ద్‌?
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని చార్తవాల్ ప్రాంతంలో జూలై 1న నౌషాద్ త్యాగిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు ఉద్యోగం చేస్తున్న‌ట్టు న‌మ్మించి ప‌లువురు మ‌హిళ‌ల‌ను మోసం చేయ‌డంతో పోలీసులు అత‌డికి బేడీలు వేశారు. యూపీ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG)లో కానిస్టేబుల్‌గా నటిస్తూ, మారు పేర్ల‌తో కొన్నేళ్లుగా వంచ‌న‌కు పాల్ప‌డిన‌ట్టు అత‌డిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త్యాగికి ఇద్దరు భార్యలు, 20 మంది స్నేహితురాళ్లు ఉన్నార‌ని.. వీరిలో 10 మందితో శారీరక సంబంధాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.

వారే త్యాగి టార్గెట్‌..
వితంతువులు, భ‌ర్త‌ల నుంచి విడిపోయిన మ‌హిళ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని త్యాగి మోసాల‌కు పాల్ప‌డ్డాడు. తాను లక్ష్యంగా చేసుకున్న మహిళ మతం ఆధారంగా తన వేషం మారుస్తాడు. హిందూ మహిళలకు రాహుల్ లేదా రికీగా, ముస్లిం మహిళలకు నౌషాద్‌గా ప‌రిచ‌యం చేసుకుని ద‌గ్గ‌ర‌వుతాడు. త‌ర్వాత వారి నుంచి డ‌బ్బు, బంగారం, ఖ‌రీదైన వ‌స్తువులు దోచుకుని ఉడాయిస్తాడు. ముజఫర్‌నగర్‌లో మొద‌టి భార్య‌, ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో అత‌డి రెండ‌వ భార్య‌ ఉంటారు. వీరిద్ద‌రికీ తెలియ‌కుండా త్యాగి వంచ‌న ప‌ర్వం కొన‌సాగించాడు. మొద‌టి భార్య అత‌డి కంటే 23 సంవత్సరాలు పెద్ద‌.

నాలుగు రాష్ట్రాల్లో మోసాలు
యూపీతో పాటు ఢిల్లీ, మేఘాలయ, అసోం రాష్ట్రాల్లో ఆరేళ్లుగా నౌషాద్ త్యాగి మోసాల‌కు పాల్ప‌డిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. ఘజియాబాద్, బులంద్‌షహర్, మధుర, సంభాల్, ముజఫర్‌నగర్ ప్రాంతాల్లో వేర్వేరు పేర్ల‌తో అత‌డు వంచ‌న ప‌ర్వం సాగించిన‌ట్టు తెలిపారు. అంతేకాదు పోలీసు యూనిఫాం ధ‌రించి జ‌నాన్ని బెదిరించి డ‌బ్బులు గుంజేవాడ‌ని చెప్పారు. సంబంధిత సెక్షన్ల కింద అత‌డిపై కేసు నమోదు చేశారు. తన మోసపూరిత చర్యలకు ఉపయోగించిన యూనిఫామ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దొరికాడిలా..
ముజఫర్ నగర్‌లో దుకాణం నడుపుతున్న ఒక వితంతువును త్యాగి వలలో వేసుకోవడంతో ఈ దురాగ‌తం బయటపడింది. త‌న‌ను రాహుల్ త్యాగిగా పరిచయం చేసుకుని, ఆమె దుకాణానికి తరచుగా వెళ్లేవాడు. ఆమెపై ప్రేమ న‌టించి పెళ్లి చేసుకుంటానని న‌మ్మించి 2 లక్షల 75 వేల రూపాయలు గుంజాడు. తాక‌ట్టులో ఉన్న 3 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను విడిపించేందుకు ఆమెను ఒప్పించాడు. అయితే పెళ్లి ప్ర‌స్తావ‌న తెచ్చిన‌ప్పుడ‌ల్లా అత‌డు తప్పించుకోవడానికి చూసేవాడు. దీంతో అనుమానం వ‌చ్చిన బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో బండారం బ‌య‌ట ప‌డింది. అప్ప‌టికే విష‌యం అర్థ‌మై కొత్త 'తోడు' కోసం వెతుక్కునే ప్ర‌య‌త్నంలో ఉండ‌గా పోలీసులు త్యాగి ఆట క‌ట్టించారు. అత‌డి మొబైల్ ఫోన్‌లో అనేక మంది మహిళల అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు ఉన్న‌ట్టు గుర్తించారు. మారు పేర్ల‌తో అత‌డు త‌యారు చేయించిన నేమ్ ప్లేట్‌లను స్వాధీనం చేసుకున్నారు.

చ‌ద‌వండి: ఎంత న‌ర‌కం అనుభ‌వించాడో..

ఫ్రెండ్ యూనిఫాంతో మోసాలు..
పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న స్నేహితుడితో ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రాంతంలో నౌష‌ద్ త్యాగి నివ‌సించేవాడు. 2019 లోక్‌సభ ఎన్నికల స‌మ‌యంలో అత‌డి ఫ్రెండ్ మధ్యప్రదేశ్‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. అత‌డు అనుకోకుండా యూనిఫాం, ఇతర వస్తువులను త్యాగి వద్ద వదిలి వెళ్లాడు. వీటితో నౌష‌ద్ మోసాల‌కు తెర తీశాడు. ముజఫర్‌నగర్‌కు మకాం మార్చి.. త‌న‌కు తాను పోలీసు కానిస్టేబుల్‌గా చెప్పుకుంటూ చెల‌రేగిపోయాడు. ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు చిక్కాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement