‘మున్సిపోల్స్‌’కు ముహూర్తం..!  | Drafting Of Wards For Municipal Elections In December | Sakshi
Sakshi News home page

‘మున్సిపోల్స్‌’కు ముహూర్తం..! 

Nov 30 2019 5:54 AM | Updated on Nov 30 2019 5:54 AM

Drafting Of Wards For Municipal Elections In December - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్‌ కార్పొరేషన్లకు వచ్చే ఏడాది జనవరి చివరివారం లేదా ఫిబ్రవరి తొలి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్‌ జారీ తేదీ నుంచి దాదాపు 18–20 రోజుల వ్యవధిలోగా ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసే అవకాశముంది. 73 మున్సిపాలిటీల్లో వార్డుల విభజన, రిజర్వేషన్లను ప్రకటిస్తూ ప్రభుత్వం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. మళ్లీ వార్డుల విభజనకు ముసాయిదా ప్రకటన జారీచేసి వారం పాటు అభ్యంతరాలు స్వీకరించాలని, ఆ తర్వాత వారంలోగా ఈ అభ్యంతరాలు పరిష్కరించి వార్డుల విభజనకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను జారీ చేయాలని హైకోర్టు సూచించింది.

అయితే వార్డుల విభజన ప్రక్రియను 7 రోజుల్లో పూర్తి చేయాలని ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు పేర్కొంటున్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియను 14 రోజుల్లో పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. హైకోర్టు తీర్పు ప్రతి అందిన వెంటనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ అధికారవర్గాలు తెలిపాయి. తదుపరి డిసెంబర్‌ తొలి వారంలో వార్డుల విభజనకు సంబంధించిన ముసాయిదా ప్రకటన జారీ చేసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత 14 రోజుల గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గణన.. 
వార్డుల విభజన అనంతరం ఎన్నికలు జరగాల్సి ఉన్న 141 పురపాలికల్లో రిజర్వేషన్లను ఖరారు చేసే ప్రక్రియను పురపాలికలు చేపట్టనున్నాయి. తొలుత రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించనుంది. అనంతరం వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించేందుకు మున్సిపాలిటీలు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నాయి. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నాయి. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోగా వార్డుల వారీగా రిజర్వేషన్లను ప్రకటిస్తూ నోటిఫికేషన్లను జారీ చేయనున్నాయి.

వార్డుల విభజన ప్రకటన ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం పోలింగ్‌ కేంద్రాల జాబితాలను ప్రకటించనుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తికావడానికి దాదాపు నెల రోజులకు పైగా సమయం పట్టే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్లను ప్రకటించిన రెండు, మూడు రోజులకే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వసన్నద్ధతో ఉంది. 

ఫిబ్రవరి దాటితే మళ్లీ వాయిదే.
మున్సిపల్‌ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్‌ ఎన్నికలు ముగిస్తే మరో 4 ఏళ్ల పాటు రాష్ట్రంలో మరెలాంటి ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఇక మార్చి, ఏప్రిల్‌ నెలల్లో విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. దీంతో ఎన్నికల నిర్వహణకు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో వచ్చే ఫిబ్రవరిలోగానే మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement