ఫలించిన అమ్మ 'తపస్'

Down Syndrome Boy Giving Dance Performance In International Level - Sakshi

‘డౌన్‌ సిండ్రోమ్‌’ కొడుకును డ్యాన్సర్‌గా మార్చిన భవాని  

బాలుడిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం

తన బిడ్డలాంటి వారికి శిక్షణ ఇస్తున్న మాతృమూర్తి

కలెక్టరేట్‌ : కడుపున బిడ్డ పడగానే.. అబ్బాయా.. అమ్మాయా.. అని ఏ తల్లీఆలోచించదు. పుట్టిన చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుతూ భవిష్యత్తులో ప్రయోజకులను చేయాలని ఎన్నో కలలు కంటుంది. అలాంటిది.. పుట్టిన బిడ్డకు మానసిక ఎదుగుదల లేదని తెలిస్తే.. ఎంత ఎదిగినా పసి ప్రాయంలోనేఉండిపోతాడని గుర్తిస్తే.. ఆ మాతృమూర్తి గుండె తట్టుకుంటుందా..? కానీ భవాని తట్టుకున్నారు. అమ్మగా తన బిడ్డకు అండగా నిలిచారు. విద్య నేర్పేగురువయ్యారు. ‘డౌన్‌ సిండ్రోమ్‌’ కొడుకును అంతర్జాతీయ వేదికలపై డ్యాన్స్‌ ప్రదర్శనలిచ్చే స్థాయికి తీసుకెళ్లారు. తన కొడుక్కు ‘తపస్‌’ అని పేరు పెట్టుకుని ఆ బాలుడిని పెంచేందుకు పెద్ద తపస్సే చేస్తోందా తల్లి. బిడ్డ వైకల్యానికికుంగిపోకుండా విధిని ఎదిరించి నిలిచిన తల్లి భవాని, ఆమె చూపిన బాటలో పయనిస్తున్న తపస్‌పై ‘సాక్షి’ కథనం..                         

విజయవాడకు చెందిన భవాని, లోకేష్‌ దంపతులు 2006లో నగరానికి వచ్చి దమ్మాయిగూడలో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన మూడేళ్లకు తపస్‌ జన్మించాడు. అతడు (డౌన్‌ సిండ్రోమ్‌ బాయ్‌) మానసిక దివ్యాంగుడు. ప్రతి 800 మంది శిశువుల్లో ఒకరు జన్యులోపంతో ఇలా జన్మిస్తారని, వీరికి ఐక్యూ చాలా తక్కువ ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అతడి వైకల్యం గురించి విన్న ఆ దంపతులు మొదట ఆందోళనకు గురయ్యారు. తర్వాత దేవుడిచ్చిన శాపాన్ని అధిగమించాలనుకున్నారు.  
 
తల్లే గురువుగా మారి..
మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు ఆత్మవిశ్వాసంతో వారికి కొత్త జీవితం ఇవ్వడం ఎలాగో ఆలోచించారు తపస్‌ తల్లిదండ్రులు లోకేష్, భవానీ దంపతులు. పుట్టినప్పటి నుంచి తపస్‌ ఇంటికే పరిమితమయ్యాడు. తల్లి భవానీయే గురువుగా మారి అక్షరాలు నేర్పిస్తోంది. తపస్‌కు డ్యాన్స్‌ అంటే ఇష్టమని గుర్తించిన ఇంటి వద్దే ‘తపస్‌ డ్యాన్స్‌ ఇనిస్టిట్యూట్‌’ను ప్రారంభించారు. తన బిడ్డలాంటి పిల్లలకు ఉచితంగా డ్యాన్స్‌ నేర్పిస్తున్నారు.  

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
తపస్‌కు డాన్స్‌ మీద ఉన్న మక్కువతో సులువుగా నేర్చుకున్నాడు. తల్లి భవాని ఇచ్చిన ప్రోత్సాహంతో అతడు పలు వేదికలపై డ్యాన్స్‌ పోటీల్లో ప్రతిభ చాటుతున్నాడు. గతేడాది వెస్ట్రన్‌ డాన్స్‌ ప్రదర్శనకు టీఎస్‌ఎఫ్‌ఏ (తెలుగు షార్ట్‌ఫిలిం అవార్డ్స్‌) నుంచి తపస్‌ పురస్కారం అందుకున్నాడు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ఖేలో ఇండియా’ పేరిట రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన పోటీల్లో సాఫ్ట్‌బాల్‌ పోటీల్లోనూ రెండో స్థానంలో నిలిచాడు. ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన ‘బాలోత్సవ్‌’లోను తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు. కాకినాడలో నిర్వహించిన ‘క్రియా చిల్డ్రన్‌ ఫెస్టివల్‌’లో ప్రముఖులచే సత్కారం సైతం అందుకున్నాడు. ఇటీవల జూన్‌ 11న నాన్‌ స్టాప్‌గా 35 నిముషాలు డ్యాన్స్‌ చేసిన తొలి డౌన్‌ సిండ్రోమ్‌ కిడ్‌గా ‘ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌’ను సైతం తపస్‌ సొంతం చేసుకుని ఔరా అనిపించాడు.

ఏ స్కూల్లో చేర్చుకోవడం లేదు
తపస్‌లోని ప్రతిభను గుర్తించి ఎన్నో అవార్డులు వరించినా ‘డౌన్‌ సిండ్రోమ్‌ బాయ్‌’ అనే కారణంతో ఏ స్కూల్లోను చేర్చుకోవడం లేదు. దీంతో ఇంట్లోనే చదువు చెబుతున్నాను. ఓ అకాడమీ ప్రారంభించి ఇలాంటి పిల్లలకు ఉచితంగా డాన్స్‌లో శిక్షణ ఇస్తున్నా. మానసిక వికలాంగుల తల్లిదండ్రులు ధైర్యం కోల్పోకుండా పిల్లలకు అండగా నిలవాలి. వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. అయినా తపస్‌ లాంటి ఎందరో చిన్నారుల భవిష్యత్‌కు బాటలు వేయాలని ఉంది. – భవాని, తపస్‌ తల్లి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top