రుణమో రామ‘చంద్ర’..! | doubt about on debt waiver | Sakshi
Sakshi News home page

రుణమో రామ‘చంద్ర’..!

Jun 18 2014 2:04 AM | Updated on Oct 1 2018 6:38 PM

రుణమో రామ‘చంద్ర’..! - Sakshi

రుణమో రామ‘చంద్ర’..!

రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. పాత రుణాలు మాఫీ అయ్యి కొత్తవి ఇస్తే ఖరీఫ్ సాగు చేసుకుందాని రైతులు గంపెడాశతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.

 చెన్నూర్ : రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. పాత రుణాలు మాఫీ అయ్యి కొత్తవి ఇస్తే ఖరీఫ్ సాగు చేసుకుందాని రైతులు గంపెడాశతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వార్షిక రుణ ప్రణాళిక ఆర్‌బీఐ నుంచి రాకపోవడంతో రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. రుణ మాఫీకి సంబంధించిన విధివిధానాలపైనా ఆర్‌బీఐ నుంచి బ్యాంకర్లకు ఎలాంటి ఆదేశాలూ రాకపోవడంతో రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులవుతోంది. రైతులు ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకునేందుకు సన్నద్ధమయ్యారు. పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. గత ఏడాది ఇదే మాసంలో రుణ ప్రణాళిక సిద్ధం చేసి 80శాతానికి పైగా రుణాలు అందజేశారు. ఈ ఏడాది అదే మాదిరిగా రుణాలు అందజేస్తారని రైతులు ఆశించగా.. నిరాశే ఎదురవుతోంది.

 ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వైపు చూపు
ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ రైతుల ఖాతాలకు చేరాలంటే మరో రెండు నెలలు పటే అవకాశం ఉంది. అప్పటికి ఖరీఫ్ సీజన్ సగానికి పైగా పూర్తవుతుంది. ఖరీఫ్ సాగు చేసేందుకు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యాపారులు అధిక వడ్డీ వసూలుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందితే వడ్డీ తక్కువ ఉండడమే కాకుండా పంట నష్టం సంభవిస్తే రుణం మాఫీ అవుతుంది. దీంతో రైతులు నష్టపోకుండా ఉంటారు. ప్రైవేటు వ్యాపారుల వద్ద రుణం తీసుకుంటే వచ్చిన దిగుబడి వడ్డీలకే సరిపోతుందని రైతులు అంటున్నారు. వెంటనే బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కోరుతున్నారు.
 
ఏడు వేల మందికి రుణ మాఫీ
ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ వల్ల చెన్నూర్‌లోని ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకు, దక్కన్ గ్రామీణ బ్యాంకు, సహకార బ్యాంకు, కోటపల్లి మండలం దక్కన్ గ్రామీణ బ్యాంకు, కిష్టంపేట ఎస్బీహెచ్‌లో చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాలకు చెందిన ఏడు వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. సుమారు రూ.45 కోట్లకు పైగా మాఫీ వర్తిస్తుందని బ్యాంకర్లు అంటున్నారు. రుణ మాఫీకి సంబంధించిన రైతుల వివరాలను బ్యాంకర్లు సిద్ధం చేస్తున్నారు. ఒక్క చెన్నూర్ పట్టణంలోని సహకార బ్యాంకులోనే 1,244 మంది రైతులకు రూ.5.80 కోట్లు రుణం మాఫీ అవుతుందని బ్యాంకర్లు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement