డబుల్‌.. గుబుల్‌ | Double Bed Room Works Delayed In Medak District | Sakshi
Sakshi News home page

డబుల్‌.. గుబుల్‌

Apr 13 2018 11:05 AM | Updated on Sep 29 2018 4:44 PM

Double Bed Room Works Delayed In Medak District - Sakshi

నర్సాపూర్‌:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి.  పంచాయతీరాజ్, విద్యుత్‌ శాఖ అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో నర్సాపూర్‌లో పనులు జరగడం లేదు. ఇక్కడ ఇళ్ల నిర్మాణ పనులు చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయిన కొద్దిరోజులకే చిన్న సమస్యతో పనులు నిలిచిపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. పట్టణానికి ఐదు వందల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరయ్యాయి. పట్టణ శివారులోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఎదురుగా ఉన్న 79 సర్వే నంబరులోని మూడెకరాల్లో 160, యార్డు పక్కన ఉన్న అదే సర్వే నంబరులోని మరో ఏడెకరాల్లో 340 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు.  మొదటగా యార్డు ఎదురుగా నిర్మాణ పనులను జనవరి నెలలో  చేపట్టారు.  ఈ నిర్మాణ పనులను రాహు కన్ర్‌çస్టక్షన్స్‌ అనే సంస్థకాంట్రాక్టు తీసుకుంది. 

విద్యుత్‌ వైర్లు ఉన్నందునే..
ఇళ్లు నిర్మాణ పనులు ప్రారంభించని స్థలం పైనుంచి విద్యుత్‌ వైర్లు ఉన్నాయి.  కండక్టర్‌ వైర్ల కింద నిర్మాణ పనులు చేపట్టడం ప్రమాదకరంగా ఉండడంతో సుమారు నెల రోజుల క్రితం  పనులు నిలిపివేశారు. ఇప్పటివరకు  గోతులు తీసి ఫిల్లర్లు ఏర్పాటు చేశారు. ఈ వైర్లు తొలగించాలని సదరు కాంట్రాక్టరు పంచాయితీ రాజ్‌ శాఖ అధికారులను కోరారని తెలిసింది. కాగా  వారు కరెంటు వైర్లను తొలగించాలని విద్యుత్తు శాఖ అధికారులను కోరారు.  వైర్లు తొలించడానికి గాను షిఫ్టింగ్‌ చేసిన చార్జీలు ఇస్తే వాటిని తొలగిస్తామని చెప్పడంతో పాటు సుమారు రెండు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని విద్యుత్‌ శాఖ అధికారులు అంచనా తయారు చేసి పంచాయతీ రాజ్‌ శాఖకు అందచేశారని సమాచారం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే అందజేస్తామని పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు చెప్పినా విద్యుత్‌ శాఖ అధికారులు వైర్లను తొలగించే పనులు చేపట్టడం లేదని తెలిసింది. 

అంతటా అయోమయం
నర్సాపూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరి«ధిలోని శివ్వంపేట మండలంలోని దంతాన్‌పల్లి, సికింద్లాపూర్‌ పిట్టలవాడలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులు సజావుగా సాగుతున్నాయి. కౌడిపల్లికి 65 ఇళ్లు, తునికి గ్రామానికి 30, కొల్చారం, ఎనగండ్ల గ్రామాలకు 20 ఇళ్ల చొప్పున  చడూర్‌ గ్రామానికి 35 ఇళ్లు మంజూరయ్యాయి.ఈ గ్రామాల్లో ఇంత వరకు నిర్మాణ పనులు ప్రారంభించలేదు.

ఉన్నతాధికారులకు తెలిపాం..
డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మిస్తున్న స్థలం పైన ఉన్న కరెంటు వైర్లు తొలగించెందుకు షిఫ్టింగ్‌ చార్జీలు మంజూరు చేయాలని  ఉన్నతాధికారులకు  విద్యుత్తు శాఖ అధికారులు ఇచ్చిన అంచనాలను పంపించాం. నిధులు మంజూరు కాగానే విద్యుత్‌ శాఖకు అందజేస్తాం. త్వరలో నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైర్లు తొలగించగానే నిర్మాణ పనులు మొదలయ్యెలా చర్యలు తీసుకుంటాం.
–స్వామిదాస్, పంచాయితీ రాజ్‌ ఏఈ, నర్సాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement