‘స్వైన్‌ఫ్లూ’ కాలంతో జాగ్రత్త..

Doctors Said Be Care In Winter Season With Swine Flu - Sakshi

చలికాలం సమీపించడంతో జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే చలి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

సాక్షి, నల్లగొండ టౌన్‌: చలికాలం సమీపించడంతో జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే చలి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే మేలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో స్వైన్‌ఫ్లూ బారిన పడి మరణించిన సంఘటనలు లేనప్పటికీ చలికాలంలో వ్యాధి వ్యాప్తి చెందే అవకావం లేకపోలేదు. చలితీవ్రత లేని రోజుల్లో అంటే ఈ ఏడాది మార్చి నాటికే జిల్లాలో 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, శాలిగౌరారం, మర్రిగూడ మండలాల్లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ కేసులను నమోదైన సంఘటనలు ఉన్నాయి. వారికి హైదరాబాద్‌లోని గాంధీ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొంది వ్యాధి నుంచి విముక్తులయ్యారు. 

అప్రమత్తంగా వైద్య ఆరోగ్యశాఖ..
చలికాలంలో గాలి ద్వారా ఒకరి నుంచి మరోకరికి ఇన్‌ఫ్లూయంజా ఏ వైరస్‌ వ్యాప్తి చెందుతుండడం, ఊపిరితిత్తుల అంతర భాగాలకు వ్యాధి సోకడం వల్ల ప్రమాదకారిగా మారి ప్రాణాపాయం సంబవించే అవకాశం ఉంటుం ది. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఎవరైనా కనపడితే వెంటనే వారి రక్తనమూనాలను సేకరించి హైదరాదాద్‌లోని ఐపీఎం (ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రీవెంటీవ్‌ మెడిషిన్‌) ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో పది పడకలతో ప్రత్యేక స్ల్వైన్‌ఫ్లూ వార్డును ఏర్పాటు చేశారు. స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ అని ఐపీఎం నివేదికలో తేలితే వెంటనే వారికి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స అందించడానికి అవసరమైన మందులను కూడా అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగశాఖ అధికారులు పేర్కొంటుననారు. ప్రజలు వ్యాధిపై అవగాహనను పెంపొందించుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. 

స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు..
దగ్గు, ముక్కుకారడం, ఆయాసం, దమ్మురావడం, ఊపిరిపీల్చడానికి కష్టపడడం, పిల్లికూతులు రావడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, గొంతులో గరగర, జ్వరం రావడం, వం టి నొప్పులు, కళ్ల నుంచి నీరుకారడం, చెవి నొ ప్పి, చెవి నుంచి చీము కారడం, చిన్న పిల్లలకు నిమ్ముచేయడం వంటి లక్షణాలు కనపడతాయి.
స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన 

జాగ్రత్తలు..
బహిరంగ ప్రదేశాలు, ఏటీఎంలు, తలుపుల గొళ్లాలు, మొదలైన వాటిని వాడిన తరువాత, ప్రయాణాలను చేసిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కునే వరకు  ముక్కు, కళ్లు, నోటిని ముట్టుకోవద్దు. చేతులను తరుచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి, ముక్కకు చేతి రుమాలును అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. చలికాలంలో మంచుపడుతున్న సమయంలో బయటకు రాకూడదు. ఉన్నిదుస్తులను ధరించాలి, వేడివేడి ఆహరం, గోరువెచ్చని నీ టిని తాగడం మంచిది. చిన్న పిల్లల శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉన్ని దుస్తులను వేయాలని, లక్షణాలు కనపడిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేం«ద్రంలోని డాక్టర్‌ను సంప్రదించాలి.

ముందస్తు జాగ్రత్తలు చేపట్టాం
చలి పెరుగుతుండడంతో స్వైన్‌ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. స్వైన్‌ఫ్లూను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైనా అనుమానిత కేసులు నమోదైతే వెంటనే ప్రత్యేక వైద్య బృందం వెళ్లి వారిని పరీక్షించడంతో పాటు చుట్టూ ఉన్న యాబై ఇండ్లలోని వారికి కూడా పరీక్షలను చేయడానికి ఏర్పాట్లు చేశాం. 
– డాక్టర్‌ అన్నిమళ్ల కొండల్‌రావు, డీఎంహెచ్‌ఓ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top