నిలోఫర్‌లో డిష్యూం..డిష్యూం

Doctors Chairs Fight in Niloufer Hospital Hyderabad - Sakshi

కుర్చీలతో పరస్పర దాడులకు డాక్టర్ల యత్నం

తీవ్ర వాగ్వాదం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సమక్షంలోనే ఘటన

సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిలోఫర్‌ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో వైద్యుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సమక్షంలోనే ఇద్దరు వైద్యులు నువ్వెంత..? అంటే నువ్వెంత...? అంటూ ఒకరిపై మరొకరు, కుర్చీలు పైకెత్తి కొట్టుకునేందుకు యత్నించడంతో పాటు పరుష పదజాలంతో దూషించుకోవడంతో తోటివైద్యులు విస్తుపోయారు. వివరాల్లోకి వెళితే.. ఆస్పత్రిలో ఆర్‌ఎంఓగా పని చేస్తున్న డాక్టర్‌ లాలూప్రసాద్‌ రాథోడ్, పీడియాట్రిక్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ రవికుమార్‌ మధ్య గతకొంత కాలంగా అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. పీజీలకు ఉపకార వేతనాల చెల్లింపు విషయంపై సోమవారం సూపరింటెండెంట్‌ మురళీకృష్ణ ప్రొఫెసర్‌ రవికుమార్‌ మధ్య చర్చ జరుగుతుండగా, అక్కడే ఉన్న లాలూప్రసాద్‌ జోక్యం చేసుకుని మాట్లాడటంతో రవికుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో ఇద్దరు తీవ్ర పరుష పదజాలంతో పరస్పరం దూషించుకుంటూ కొట్టుకునేందుకు కుర్చున్న కుర్చీలను పైకెత్తారు.

దీంతో అక్కడే ఉన్న సూపరింటెండెంట్‌ సహా పలువురు వైద్యులు నివ్వెరపోయారు. ఇదిలా ఉండగా పీజీల హాజరు పట్టికను ఎప్పటికప్పుడు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌కు పంపించకుండా, ప్రభుత్వం మంజూరు చేసిన ఉపకారవేతనాలను వారికి చెల్లించకుండా పీడియాట్రిక్‌ విభాగాధిపతి ప్రొ ఫెసర్‌ రవికుమార్‌ జాప్యం చేస్తున్నాడని డాక్టర్‌ లాలూప్రసాద్‌ ఆరోపించగా, అకాడమిక్‌ విషయాల్లో ఆర్‌ఎంఓలకు సంబంధం ఏమిటని ప్రొఫెసర్‌ రవికుమార్‌ ప్రశ్నించారు. 

చర్య తీసుకుంటాం
పీజీలకు ఉపకార వేతనాలు చెల్లించక పోవడంపై సంబంధిత విభాగాధిపతి నుంచి వివరణ కోరతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అదే విధంగా ఉన్నత మైన వైద్యవృత్తిలో కొనసాగుతూ ఆస్పత్రి ఆవరణలో రోగుల సమక్షంలో దుర్భాషలాడుకోవడం, ఆరోపణలు చేసుకోవడంతో సంస్థకు చెడ్డపేరు వస్తుంది. ఆస్పత్రికి ప్రతిష్టకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ఈ ఘటనపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.   – డాక్టర్‌ రమేష్‌రెడ్డి, డీఎంఈ   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top