ఢూం..ఢాం!

ఢూం..ఢాం! - Sakshi


జోరుగా టపాసుల జీరో దందా

* అక్రమార్కులకు దీపావళే..!

* సర్కార్ ఖజానాకు భారీ గండి

* కళ్లుమూసుకున్న ఆ నాలుగు శాఖలు

* చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు


సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రూ.కోట్లకు కోట్ల దీపావళి సరుకు దిగుతోంది. అంతా అక్రమ దందా... జీరో మాల్. ఈ మాల్‌ను పట్టుకోవడానికి మన అధికారులు మాటేశారు. అవి టపాసులు కదా..! కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతేదో కమ్ముకొచ్చింది. ఆ కాంతికే  వాణిజ్య పన్నులు, పోలీసు, మన్సిపల్, అగ్నిమాక, రెవిన్యూ శాఖల అధికారుల కళ్లు మూతలు పడుతున్నాయి. కళ్లు నలుసుకొని తెరిచి చూసే సరికి  కంటి ముందు నోట్ల కట్టలు. ఇంకేముందు సార్లకు కాళ్లు కదలట్లేదు. నోళ్లు పెగలట్లేదు. నోట్ల కట్టలు లెక్కపెట్టుకుంటూ జీరో మాల్‌ను వదిలేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు పన్ను రూపంలో వచ్చే రూ కోట్లకు గండి కొడుతున్నారు.

 

ఆయన కన్ను గీటితే...

దీపావళికి జిల్లాలో 2 వేల టపాసుల దుకాణాలు  వెలుస్తాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో రూ.30 కోట్ల వ్యాపారం సాగుతుంది. ఇదంతా  అనధికారిక లెక్క. జీరో దందా.  జిల్లా వాణిజ్య పన్నుల శాఖ, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు కళ్లు మూసుకోవడంతో సాగుతున్న అక్రమ వ్యాపారం. అలాగని చిన్నా చితక చిల్లర కొట్టు వ్యాపారులు లాభపడుతున్నది లేదు. ఒకే ఒక వ్యాపారి గుప్పిట్లోనే ఈ దందా నడుస్తోంది. రామచంద్రాపురానికి చెందిన ఈ వ్యాపారి కన్ను గీటితే... వాణిజ్య పన్నులు, పోలీసు, మన్సిపల్, అగ్నిమాపక శాఖల అధికారులు కళ్లు మూసుకుంటున్నారు.   



సంగారెడ్డి, మెదక్, పటాన్‌చెరు, జహీరాబాద్, అందోల్, సదాశివపేట, సిద్దిపేట, నారాయణఖేడ్ పట్టణాల్లో దుకాణాల లెసైన్స్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ అధికారులు అనుమతులు ఇవ్వకుండా హోల్‌సేల్ వ్యాపారి అడ్డుకుంటున్నాడు. వాస్తవానికి పటాన్‌చెరు,సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట పట్టణాల్లో టపాసులకు మంచి గిరాకీ ఉంటుంది. అందుకే ఇక్కడ వందల్లో దుకాణాలు వెలుస్తాయి. కానీ ఒక్క దుకాణానికి కూడా లెసైన్స్ ఉండదు.

 

అక్రమ దందా

దీపావళి పండగ సందర్భంగా టపాసులు విక్రయించాలనుకునేవారు దుకాాణాల ఏర్పాటుకు పోలీసు, మున్సిపల్, అగ్నిమాపక శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది.  నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఆధారంగానే రెవెన్యూ శాఖ అధికారులు (జిల్లా కలెక్టర్) క్యాజువల్ ట్రేడ్ లెసైన్సులు జారీ చేస్తారు. కానీ జిల్లాలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న దుకాణాల్లో కొన్నింటికి మాత్రమే లెసైన్సులు ఉంటాయి. మిగతా వాటికి లెసైన్సులు తీసుకోకుండానే నిర్వహిస్తారు. తెచ్చిన సరుకుకు లెక్కాపత్రం ఉండదు.  టకాపాయల అమ్మకాలను బట్టి వాణిజ్య పన్నుల శాఖకు 14.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ. 4 కోట్ల వరకు  వాణిజ్య పన్నుల రూపంలో ఆదాయం రావాల్సి ఉంది, కానీ రూ. 4 లక్షల ఆదాయం కూడా సమకూరటం లేదు.

 

నో అబ్జెక్షన్‌తోనే సరి

దుకాణదారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌తోనే వ్యాపారం కొనసాగిస్తున్నారు. నిజానికి ఇలా అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలపై నాలుగు శాఖల అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ  వాటిని నియంత్రించాల్సి ఉంటుంది. కానీ ఏ అధికారి కూడా వారి వైపు కన్నెత్తి చూడడం లేదు.  కారణం ఏమిటంటే అక్రమ వ్యాపారం సక్రమంగా సాగేందుకు ప్రతి దుకాణానికి రూ.25 వేలు వసూలు చేసి అధికారుల జేబులు నింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వంలోనైనా అధికారులు టపాసుల వ్యాపారంపై వచ్చే వాణిజ్య పన్నుల మీద దృష్టిపెడితే భారీగా ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top