దేవాదాయలో కలకలం..!

Disputes Between Employees In Endowment Department - Sakshi

అసిస్టెంట్‌ కమిషనర్‌పై ఆ శాఖ గద్వాల ఇన్‌స్పెక్టర్‌ ఆగ్రహం  

మహిళనని చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ ఆరోపణ 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖలో కలకలం రేగింది. ఆ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణ.. అదే శాఖలో గద్వాల ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరమ్మల మధ్య కొన్ని నెలల క్రితం మొదలైన వివాదం తారాస్థాయికి చేరుకుంది. కొన్నాళ్లుగా అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ) తన గురించి అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారంటూ వెంకటేశ్వరమ్మ మండిపడుతున్నారు.

ఏసీ వ్యవహారశైలిపై ఇది వరకే డిప్యూటీ కమిషనర్‌ రామకృష్ణాకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటోన్న ఆమె త్వరలోనే మహిళా సంఘాలను ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడిన వెంకటేశ్వరమ్మ అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే... ఇప్పటికే ఆ శాఖలో చర్చనీయాంశంగా మారిన ఇరువురు అధికారుల వ్యవహారం ఎటు దారి తీస్తుందో అనే చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. 

మౌనమేలనోయి..? 
అసిస్టెంట్‌ కమిషనర్, గద్వాల డివిజన్‌ ఇన్‌స్పెక్టర్ల మధ్య వివాదం రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. అసిస్టెంట్‌ కమిషనర్‌ తన గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటోన్న వెంకటేశ్వరమ్మ ఆరోపణల్లో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియదు. ఇటు అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణ కూడా వెంకటేశ్వరమ్మ గురించి తాను ఏనాడూ అసభ్యకరంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. అయితే వీరిద్దరి కోల్డ్‌వార్‌ గురించి పైస్థాయి అధికారులకు తెలిసినా వారు మౌనపాత్ర పోషిస్తున్నారంటూ ఆ శాఖ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించకపోతే దేవాదాయ శాఖ అభాసుపాలవుతుందనే ఆవేదన ఆ శాఖ ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది.  

మరో దారి లేదు.. 
సహచర ఉద్యోగిగా ఉన్న తనను అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణ చిన్నచూపు చూస్తున్నారని వెంకటేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీ తనపై ఎలా కక్ష సాధిస్తున్నారని ‘సాక్షి’కి వివరించారు. ‘జూన్, 2018 వరకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో పని చేసిన తనకు నాగర్‌కర్నూల్‌ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ అవకాశం వచ్చింది. కానీ అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణ అక్కడ విల్లింగ్‌ చూపొద్దని.. గద్వాలలో పని చేస్తానని నాతో పైస్థాయి అధికారులకు చెప్పించారు. ఈ క్రమంలో గద్వాల డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ అయ్యాను. తర్వాత సహచర ఉద్యోగుల ముందు నన్ను అసభ్యపదజాలంతో దూషించడం మొదలుపెట్టారు.

అందరి సమక్షంలో నాకు పని రాదంటూ నాలో మానసిక ఆవేదన కలిగించారు. ఈ విషయంలో నేను డిప్యూటీ కమిషనర్‌ రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లా. అయినా అసిస్టెంట్‌ కమిషనర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంతటితో ఏసీ వేధింపులు ఆగలేదు. ఇప్పటికీ ఆయన అలానే వ్యవహరిస్తున్నారు.అందుకే త్వరలోనే మహిళా సంఘాలను ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్న’ అని గద్వాల ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరమ్మ వివరించారు. 

పని చేయమంటేనే ఇదంతా: అసిస్టెంట్‌ కమిషనర్‌ బి.కృష్ణ 
 ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖకు నేను అధికారిని. ఆమెతో పాటే చాలా మంది నా వద్ద పని చేస్తున్నారు. నాకెవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు. పని దగ్గర మాత్రం నేను సీరియస్‌గా ఉంటాను. వెంకటేశ్వరమ్మ విషయానికి వస్తే.. ఆమె నాపై అలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. పైస్థాయి అధికారులు అడిగిన సమాచారం నిర్ణీత సమయంలోగా ఇవ్వమనే కొంచెం గట్టిగా చెబుతాను. అంతే గానీ ఎన్నడూ ఆమెతో అసభ్య పదజాలంతో మాట్లాడలేదు. ఆ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top