ప్రకృతి సోయగాల కూర్పు | development of tourism in adilabad district | Sakshi
Sakshi News home page

ప్రకృతి సోయగాల కూర్పు

Sep 27 2014 12:31 AM | Updated on Aug 17 2018 2:53 PM

ప్రకృతి సోయగాల కూర్పు - Sakshi

ప్రకృతి సోయగాల కూర్పు

ప్రకృతి సోయగాలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కారు కూర్పు చేస్తోంది. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో భాగంగా జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పర్యాటక స్థలాలు గుర్తించారు.

ఆదిలాబాద్ : ప్రకృతి సోయగాలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కారు కూర్పు చేస్తోంది. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో భాగంగా జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పర్యాటక స్థలాలు గుర్తించారు. ఈ ప్రాంతాలను ఐదేళ్లలో పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో 16 పనులు, మండల స్థాయిలో 33 పనులు మొత్తం 49 పనులకు రూ.115.95 కోట్లు అవసరమని భావిస్తున్నారు.
 
కాగా, జిల్లా స్థాయి పనులకు పర్యాటక శాఖ నిధులు కేటాయించనుంది. వీటిని 2016లోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక మండల స్థాయి పనులకు ఎంపీ, ఎమ్మెల్యే ఇతరత్రా నిధులతో చేపట్టాలని యోచిస్తున్నారు. ఇప్పటి వరకు పర్యాటక శాఖ నుంచి రూ.9 కోట్లు రాగా, జిల్లాలో అనేక పనులు చేపట్టారు. జన్నారం ఏకో టూరిజం, కడెం జలపాతం వద్ద బోటింగ్, రీసార్ట్, రెస్టారెంట్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేలా టూరిజం సర్క్యూట్ టూర్(కూర్పు) ప్రణాళిక చేస్తున్నారు.
 
ఐదేళ్లలో విడతలవారీగా..
తెలంగాణ సర్కారు ‘మన ఊరు-మన ప్రణాళిక’లో భాగంగా పర్యాటక శాఖ వివిధ టూరిజం పాయింట్లను గుర్తించింది. జిల్లా స్థాయిలో గుర్తించిన 16 పనుల్లో 11 పనులను 2014-15లో రూ.50.70 కోట్లతో పూర్తి చేయాలని, అదే విధంగా మిగిలిన ఐదు పనులను 2015-16లో రూ.37.65 కోట్లతో పూర్తి చేయాలని అంచనా వేస్తున్నారు. తద్వార జిల్లా స్థాయిలో గుర్తించిన పనులను 2016లోగా నిధులు వెచ్చించి పూర్తి చేయాలని ఒక ప్రణాళిక బద్ధంగా ఉన్నారు. కాగా, నార్నూర్ మండలంలో కుండాయి, పారాకఫీ జలపాతాలు వెంకటేశ్వర మందిరం అభివృద్ధి పనులను కూడా రానున్న జిల్లా స్థాయి పనుల్లో చేర్చే అవకాశాలున్నాయి. ఇక మండల స్థాయిలో గుర్తించిన 33 పనులను రూ.27.60 కోట్లతో 2016-17 నుంచి మొదలు కుంటే 2018-19 వరకు విడతల వారీగా చేపట్టాలని ప్రతిపాదనల్లో రూపొందించారు. అయితే మండల స్థాయిలో గుర్తించిన ఈ పనులకు టూరిజం శాఖ పరంగా నిధులు కేటాయించే అవకాశాలు లేకపోవడంతో ఎంపీ, ఎమ్మెల్యే ఇతరాత్ర నిధుల నుంచి కేటాయించి వాటిని పూర్తి చేయాలని యోచిస్తున్నారు.
 
మండల స్థాయిలో గుర్తించిన పనులు
భైంసా మండలంలోని బుద్ధవిహార్, దిలావర్‌పూర్ మండలంలోని కాల్వ నర్సింహాస్వామి ఆలయం, నిర్మల్‌లోని జంగల్ హనుమాన్ మందిరం, నిర్మల్ మండలం అక్కాపూర్, ముత్తాపూర్, సోన్‌లలో వెంకటేశ్వర ఆలయం, మామడలోని వెంకటేశ్వర ఆలయం, నిర్మల్‌లోని దేవరకోట వెంకటేశ్వర ఆలయం, లక్ష్మణచాందలోని న్యూవెల్మల్ వెంకటేశ్వర ఆలయం, మామడ మండలం పొన్కల్, నిర్మల్ మండలంలోని విశ్వనాథపేట వెంకటేశ్వర ఆలయాలు, నిర్మల్‌లోని అభయ అంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాలను 2016-17లో అభివృద్ధి చేయాలని మన ప్రణాళికలో చేర్చారు.

మామడలోని భీమన్న ఆలయం, దిలావర్‌పూర్‌లోని చక్రలింగేశ్వర ఆలయం, నిర్మల్ మండలం మేదిపల్లి గణేష్ ఆలయం, నిర్మల్ వడ్డెర కాలనీలోని హనుమాన్ మందిరం, సారంగపూర్‌లోని అడెల్లి పొచ్చమ్మ ఆలయం, నిర్మల్ మంగల్‌పేట్, జాఫ్రపూర్, సారంగపూర్ మండలంలోని వంజర్ మహాలక్ష్మీ ఆలయాలు, మామడలోని పొన్కల్ నాగదేవత ఆలయం, ఆలూరులోని రాజరాజేశ్వర ఆలయాలను 2017-18లో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. నిర్మల్ బ్రహ్మపురి రామాలయం, మునిపల్లి సాయిబాబ ఆలయం, మామడ మండలం న్యూసాంగ్వి సాయిబాబ ఆలయం, నిర్మల్ గండిరామన్న సాయిబాబ ఆలయం, సారంగాపూర్ మండలం భీరవెల్లి సాయిబాబ ఆలయం, సోన్ శివాలయం, నర్సాపూర్(జి)లోని శివాలయం దేవుని చెరువు, ఎల్లమ్మ ఆలయం, ఖానాపూర్ సదర్‌మట్, దండేపల్లి చిన్నయ్యగుట్టలను 2018-19లో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement