పిల్లలపైనే డెంగీ పడగ!

Dengue Is The most Common In Children Telangana - Sakshi

జ్వర బాధితుల్లో మూడో వంతు వారే

సర్కారుకు వైద్య ఆరోగ్యశాఖ నివేదిక 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని డెంగీ ఫీవర్‌ వణికిస్తోంది. ఎక్కడ చూసినా జ్వర బాధితులే కనిపిస్తున్నారు. పెద్దలు, పిల్లలు అందరూ ఈ విషజ్వరాల బారినపడుతున్నారు. అయితే, రాష్ట్రంలో నమోదవుతున్న డెంగీ కేసుల్లో దాదాపు మూడో వంతు మంది చిన్నపిల్లలు ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. గతనెల 30 నుంచి ఈ నెల 5 వరకు రాష్ట్రంలో 730 మందికి డెంగీ సోకగా.. వారిలో 261 మంది 15 ఏళ్లలోపు పిల్లలే ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. ఐదేళ్లలోపు చిన్నారుల్లో 50 మందికి డెంగీ రాగా.. 6 నుంచి 10 ఏళ్లలోపు బాలబాలికల్లో 123 మంది డెంగీబారిన పడ్డారు. ఇక 11 నుంచి 15 ఏళ్లలోపున్న వారిలో 88 మంది డెంగీతో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయింది. 15 ఏళ్లకు మించిన వారిలో 469 మందికి డెంగీ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ సర్కారుకు అందజేసిన నివేదికలో తెలిపింది. 

జ్వరాలు అదుపులోకి వచ్చాయి: ఈటల 
రాష్ట్రంలో జ్వరాలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. 24 గంటలు పర్యవేక్షణ చేస్తుండడంతో జ్వరాలు అదుపులోకి వచ్చినట్టు చెప్పారు. శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంత డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 108, 104 వాహనాలు సక్రమంగా నడిచేలా చూడాలని ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top