కేసీఆర్ ఆందోళన అర్థరహితం | Dattatreya comments on KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ఆందోళన అర్థరహితం

Nov 12 2016 3:39 AM | Updated on Apr 3 2019 5:16 PM

కేసీఆర్ ఆందోళన అర్థరహితం - Sakshi

కేసీఆర్ ఆందోళన అర్థరహితం

‘‘పెద్దనోట్ల రద్దుతో రూ.కోట్లలో నల్లధనం బయటపడుతుంది. అభివృద్ధి ప్రక్రియలో ఇదొక శుభపరిణామం.

- పెద్ద నోట్ల రద్దుతో కీలక రంగాలకు నష్టమేమీ ఉండదు
- కేంద్ర నిర్ణయం వెలువడిన రెండ్రోజులకే ఆందోళన చెందితే ఎలా
- గవర్నర్‌ను కలసి అనవసర ప్రచారం చేయడం బాధాకరం
- విలేకర్ల సమావేశంలో కేంద్ర మంత్రిదత్తాత్రేయ  
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘పెద్దనోట్ల రద్దుతో రూ.కోట్లలో నల్లధనం బయటపడుతుంది. అభివృద్ధి ప్రక్రియలో ఇదొక శుభపరిణామం. కానీ రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయం వల్ల కీలక రంగాలకు నష్టాలొస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందడం అర్థరహితం. కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో సామాన్యులు కొంత ఇబ్బంది పడుతున్నారు. కానీ వారంతా ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నారు’’ అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రానికి నెలకు రూ. 2 వేల కోట్ల నష్టం వస్తుందంటూ సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులు గవర్నర్‌ను కలసి చెప్పినట్లు వార్తలు రావడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్రం నిర్ణయం తీసుకున్న రెండ్రోజులకే ఆందోళన చెందితే ఎలా అని ప్రశ్నించారు.

ఈ వైఖరి కేంద్రం ప్రతిష్టను దిగజార్చేలా ఉందన్నారు. మీడియా వార్తల నేపథ్యంలో దత్తాత్రేయ శుక్రవారం గవర్నర్‌ను కలిశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘సీఎం కేసీఆర్, ప్రభుత్వాధికారులు గవర్నర్‌తో జరిపిన చర్చకు సంబంధించిన సారాంశాన్ని నరసింహన్‌ను అడిగా. కేవలం బడ్జెట్ పునర్వ్యవస్థీకరణపైనే చర్చించినట్లు గవర్నర్ చెప్పారు. పత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించిన ఆంశాలేవీ ప్రస్తావనకు రాలేదన్నారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. పెద్దనోట్ల రద్దుపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేస్తే సీఎం మాత్రం అసంతృప్తి వ్యక్తం చేయడం హాస్యస్పదంగా ఉంది.

పైగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని మాట్లాడటం దారుణం’’ అన్నారు. త్వరలో విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని సైతం యుద్ధప్రాతిపదికన వెనక్కి తెస్తామన్నారు. నోట్ల రద్దు నిర్ణయంపై సూచనలు చేయాల్సిందిగా కేంద్రం కోరిందని... రాష్ట్రంలోని పరిస్థితిని వివరిస్తానన్నారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించి నిధుల విడుదలలో రాష్ట్రానికి ఇబ్బందులు రానివ్వనన్నారు. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు తగ్గితే ప్రజలకు ఉపశమనం లభిస్తుందని.. అతి త్వరలో ధరలు తగ్గడం ఖాయమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement