పెథాయ్‌ తుపాన్‌: నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

Cyclone Phethai Threats Telangana Old Districts Khammam And Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ / ఖమ్మం : పెథాయ్‌ తుపాన్‌ ప్రభావం వలన రాష్ట్రంలోని పాత వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాత వరంగల్‌ జిల్లాలోని ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మిరప పూతలు రాలిపోయి, దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వాపోతున్నారు. జనగామా జిల్లా పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

ఖమ్మం...
జిల్లాలోని వైరా మండలంలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల అన్నదాతలు భారీగా నష్టపోయారు. అశ్వరావుపేట మండలంలో అత్యధికంగా 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మధిర నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ఇల్లందులోని జేకే 5 ఓసీ, కోయగూడెంలోని కేఓసీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవేకాక వర్షం కారణంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని జేవీఆర్‌ సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో సుమారు 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆంటకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో పలుచోట్ల వరి, మొక్కజొన్న, ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భధ్రాద్రి కొత్తగూడెం...
పెథాయ్‌ తుపాన్‌ కారణంగా పినపాక నియోజకవర్గంతో పాటు అశ్వాపురం, మణుగూరు గుండాల మండలాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. దాంతో పలు చోట్ల వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

కరీంనగర్..
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మురుసు కమ్ముకుంది. చలి గాలులతో జనం వణికిపోతున్నారు. హుజురాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాలలో చిరుజల్లులు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో చిరుజల్లులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. మంథని వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం తడిసిపోయింది. మార్కెట్‌ను ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సందర్శించారు. రైతులకు టార్పాలిన్ కవర్లు ఇవ్వకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top